భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ) : పనితీరులో నిర్లక్ష్యం, పలు అవినీతి ఆరోపణల నేపథ్యంలో జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కుమారస్వామిని జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆల సరెండర్ చేస్తూ ఆ శాఖకు ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగూడెం జిల్లా ప్రధాన ఆస్పత్రిలో డేటా ఎంట్రీ ఆపరేటర్లను అవుట్ సోర్సింగ్ పద్ధతిలో నియమించగా.. వారికి ఆరు నెలలుగా వేతనాలు రాకపోవడంతో నేరుగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అయితే వారి వద్ద నుంచి సూపరింటెండెంట్ కొంత సొమ్మును డిమాండ్ చేసి ఉద్యోగాలు ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయనపై విచారణ చేయించిన కలెక్టర్.. పూర్తి వివరాలు తెలుసుకోవడంతోపాటు గతంలో ఆఫీసు వ్యవహారాల్లో కూడా నిర్లక్ష్యం చేయడంతో ఆయన పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో గురువారం మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌కు సరెండర్ నోటీసు పంపారు. వైద్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి సరెండర్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సూపరింటెండెంట్ కుమారస్వామి.. మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌ను కనీసం ఆస్పత్రికి కూడా రానీయలేదనే ఆరోపణలు వచ్చాయి. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో ఉన్న జిల్లా ఆస్పత్రితో మెడికల్ కాలేజీ, ఎంసీహెచ్ అనుబంధంగా ఉండేవి. వాటిపై మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డ్రాయింగ్ ఆఫీసర్‌గా ఉండేవారు. కానీ.. ఏనాడూ జిల్లా ఆస్పత్రికి రాకుండా సూపరింటెండెంట్ పెత్తనం చేశారని, ఉన్నతాధికారుల అండదండలతో వ్యవహారాలు నడిపించేవాడని తెలిసింది. అంతేకాక.. డాటా ఎంట్రీ ఆపరేటర్లు 21 మందిని కాంట్రాక్ట్ పద్ధతిన తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఏజెన్సీ నుంచి కాకుండా వారి వద్ద నుంచి ఎంతో కొంత తీసుకొని నేరుగా నియమించినట్లు తెలిసింది. వారంతా ఇటీవల కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బట్టబయలైంది. కాగా.. సూపరింటెండెంట్ కుమారస్వామిని సరెండర్ చేయడంతో ఆయన స్థానంలో ఆర్థో విభాగంలో పనిచేస్తున్న డాక్టర్ నరసింహారావుకు బాధ్యతలు అప్పగించారు.
ఆస్పత్రి వ్యవహారాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కలెక్టర్ సరెండర్ చేశారు. అంతేకాక ఆయనపై పలు ఆరోపణలు వచ్చినట్లు తెలుస్తోంది. తాత్కాలికంగా మరో డాక్టర్‌కు సూపరింటెండెంట్‌గా బాధ్యతలు అప్పగించాం.