1937లో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు నిజాం అని టైమ్స్ పత్రిక ఆయన ఆస్తి వివరాలను ప్రచురించింది. ఒక అంచనా ప్రకారమే నిజాం ఆస్తి ఆ రోజున 2 బిలియన్ డాలర్లు అని తెలిపింది. అంటే 2,016 కోట్ల డాలర్ల నిజాం దగ్గరకు ఒక విదేశీ అధికారి వచ్చినప్పుడు రత్నాలు పొదిగిన పేపర్ వెయిట్ టేబుల్ మీద ఉన్నదట. అది బాగుందని ఆ విదేశీ అధికారి అనగానే తీసుకోండి అని బహుమతిగా ఇచ్చారట నిజాం. అదీ నిజాం రాజ్య సంపద, వితరణ!
తమ రాష్ట్రంలో ఏమీ చేతకాక, సొంత మాతృభూమి మీద, ప్రజల మీద అభిమానం లేక తెలంగాణకు వలస వచ్చినవారు వేల కోట్ల రూపాయలు మింగారే తప్ప, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదు. తాము తెలంగాణ నిధులను అక్రమంగా తరలించినా తమ ప్రాంతాన్ని ఇసుమంతైనా అభివృద్ధి చేసుకోలేదు. 400 ఏండ్ల నుంచే రాజధాని ఉన్న, ప్రపంచంలోనే ఐదు సుందర నగరాల్లో ఒకటైన హైదరాబాద్‌ను తాను అభివృద్ధి చేసి ప్రపంచ పటంలో పెట్టానంటారు ఓ విజనరీ. కానీ ఐదేండ్లలో తన రాజధానిలో ఒక్కటైనా పక్కా భవనం కట్టలేని అసత్య, అసమర్థ, అవినీతి నాయకుడు. తెలంగాణ ప్రజల మంచితనాన్ని, శాంతి కాముకత్వాన్ని, తెలివితక్కువ తనంగా వర్ణిస్తారు. సామాన్య ప్రజల్లా హైదరాబాద్‌కు వలస వచ్చి తమ ప్రాంత నాయకుల ప్రభుత్వ సహాయంతో తమతమ వ్యాపారాలతో అభివృద్ధి చెంది, ఈ నగరాన్ని తామే ఉద్ధరించామంటారు ఆంధ్రా బడాబాబులు.
ఒక విశ్వవిద్యాలయంలో ఏదైనా ఒక శాఖ సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోర్సు ప్రవేశపెట్టి డబ్బు సంపాదిస్తే ఆ ధనంలో 33 శాతం ఆ విశ్వవిద్యాలయానికే ఇవ్వాలి. మరి 1956 నుంచి ఆంధ్ర నుంచి ఇక్కడికి వలస వచ్చి స్కూళ్లు, కాలేజీలు, హోటళ్లు దవాఖానలు స్థాపించి డబ్బు సంపాదించినవారి ఆదాయంలో ఏటా ప్రతి ఒక్కరూ 33 శాతం తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వాలి కదా! మరి లెక్కలు తీసి చెప్పండి హైదరాబాద్ మిమ్మల్ని ఉద్ధరించిందా? మీరు ఈ నగరాన్ని ఆదుకున్నారా? చెప్పులు లేకుండా వచ్చి రాజధాని పేరుతో ఇక్కడ తిష్టవేసి క్రమంగానూ, అక్రమంగానూ సంపాదించి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో భవంతులు కట్టుకొని మళ్లీ ఆంధ్ర నాయకులకు సపోర్ట్ చేసే వారి ఆస్తి లెక్కలు చెప్పండి. ‘ఆపరేషన్ పోలో’ సమయంలో పాకిస్థాన్‌కు సపోర్ట్ చేసేవారికి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ఒక హెచ్చరిక చేశారు. ‘ఎవరైతే భౌతికంగా హైదరాబాద్‌లో ఉండి, వారి బుర్ర మాత్రం పాకిస్థాన్‌కు సపోర్ట్ చేస్తుందో, ఆ రెండింటిని విడకొట్టి ఏ ప్రాంతానికి చెందితే అక్కడికి పంపుతాం’ అని. ఈ మాట తను బతుకుతున్న, తనకు బతుకునిచ్చిన భూమిని ద్వేషించే ఎవరికైనా వర్తిస్తుంది.
బ్రహ్మానందరెడ్డి కర్కశత్వంతో 1969 ఉద్యమం ముగిశాక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి మొట్టమొదటగా తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావును ముఖ్యమంత్రిగా నియమించింది కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం. అయితే, రెండేండ్లు కూడా కాకుండానే (1971 సెప్టెంబర్-1973 జనవరి) ముల్కీ నిబంధనలకు మద్దతిస్తూ సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పును మెచ్చుకున్నారని పీవీని పదవి నుంచి తీసేయించారు ఆంధ్ర నాయకులు. వివిధ మతాలు, కులాలు, భాషల వైవిధ్యభరితమైన భారతదేశాన్ని ఐదేండ్లూ పరిపాలించగలిగిన ప్రజ్ఞావంతుడు పీవీ నరసింహారావు.
కానీ కుటిల, కుత్సిత ఆంధ్రా నాయకుల ధాటిని మాత్రం తట్టుకోలేకపోయారు. ఇక ఐదేండ్లు (1973-1978) ముఖ్యమంత్రిగా ఉన్న జలగం వెంగళరావు ఆంధ్ర నుంచి వచ్చిన సెటిలర్. తన పూర్వీకుల కంటే ఒకడుగు ముందుకువేసి, ఒకవేళ తెలంగాణను కేంద్రం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేస్తే, హైదరాబాద్‌ను తగలబెట్టి గానీ తాను ఆంధ్రకు వెళ్లబోనని పబ్లిక్‌గా శపథం చేసిన మహానుభావుడు. కొందరు నక్సలైట్లను, ఆ పేరుతో చాలామంది తెలంగాణ యువతను ఎన్కౌంటర్లు చేసిన ఘనత ఆయనది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు చెందిన రెండో ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి (మార్చి 1978-అక్టోబర్ 1980) ప్రజ్ఞావంతుడు, పెద్ద మనుషుల ఒప్పందం మీద సంతకం చేసిన సీనియర్ మంత్రి.
కానీ అనుభవజ్ఞులైన రాయలసీమ ఫ్యాక్షనిస్టుల నేపథ్యం నుంచి వచ్చిన 30 ఏండ్ల వయస్సు కూడా లేని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తన గూండాలతో పాతబస్తీలో మత విద్వేషాలు రగిలించి.. చెన్నారెడ్డి వాటిని అదుపు చేయలేకపోయారనే నెపంతో ఆయనను కాంగ్రెస్ హైకమాండ్‌తో పదవీచ్యుతుడిని చేయించగలిగారు. 28 ఏండ్ల వయసులో ఎమర్జెన్సీకి మద్దతిచ్చి వెలుగులోకి వచ్చిన రాయలసీమకు చెందిన నాయకుడు చంద్రబాబు లాగానే, పాతబస్తీ ఘటనతో రాజశేఖర్‌రెడ్డి వెలుగులోకి వచ్చారు. గుంటూరు నుంచి వచ్చిన కాసు బ్రహ్మానందరెడ్డి, ఈ ఇద్దరు సీమ నాయకుల అధికారాన్ని అడ్డుపెట్టుకొని తెలంగాణ ప్రాంతంలో అత్యధిక హత్యలు చేయించిన వారిగా చరిత్రలో నిలిచిపోతారు. ఇక చెన్నారెడ్డి లాంటి వాడినే పదవిలో నుంచి తీసివేయించగలిగిన వీరికి, ఆ తర్వాత ముఖ్యమంత్రి, తెలంగాణ బిడ్డ టంగుటూరి అంజయ్య (అక్టోబర్ 1980-ఫిబ్రవరి 1982) లెక్కనా? ఏడాదిన్నర కాకుండానే ఆయనను కూడా ఆంధ్రా నాయకులు దించగలిగారు.
కరువు ప్రాంతంలో రెండెకరాల పొలం ఉమ్మడి ఆస్తిగా ఉండి, రాజకీయాల్లోకి వచ్చిన చంద్రబాబు మామగారిని దింపి ముఖ్యమంత్రిగా పని చేసిన నాలుగు ఏండ్లలోనే సింగపూర్, మలేషియాలో ఏడు నక్షత్రాల హోటళ్లు నిర్మించగలిగారు. ఆ డబ్బు కుప్పం నుంచి వచ్చిందా? రాయలసీమలో రత్నాలు దొరికాయా? మరి ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల సంపద పెరిగి, ఈ నాయకులు పెరిగారా? అంటే అదీ లేదు. వేలాది మంది ఆంధ్రులను పాలకులు ఉద్యోగాల్లో తెలంగాణకు తరలిస్తే, కూలీనాలి చేసుకునేవారు కూడా హైదరాబాద్‌లో వేల సంఖ్యలో తేలారు. ఈ ఆంధ్ర నాయకులు తెలంగాణలో సంపాదించిన వేలకోట్ల రూపాయల అక్రమ సంపాదనలో కొంతపెట్టి అయినా ఆంధ్ర ప్రాంతాల్లో చిన్నచిన్న పరిశ్రమలు , వ్యాపారాలు ప్రారంభిస్తే ఈ సామాన్య జనాలకైనా అక్కడ ఉపాధి దొరుకుతుంది కదా! మరి ఈ ఆంధ్ర, రాయలసీమ బడా వ్యాపారస్తులైనా కోటీశ్వరులై ‘హైదరాబాద్‌ను మేమే అభివృద్ధి చేశాం’ అని అబద్ధాలు చెప్పే కంటే, తమ తమ సొంత ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవచ్చు కదా! 72 ఏండ్ల ముందు రాష్ట్రం ఏర్పడినా, కూలి పనులకు, వాచ్మన్లు, పని మనుషులుగా ఉపాధి కోసం తమ ప్రాంత సామాన్య ప్రజలు హైదరాబాద్‌కు వలస రావటం ఈ సంపన్నులకు సిగ్గనిపించదా?
అంటే విలీనానికి ఏర్పరుచుకున్న ఎన్నోనిబంధనలను తుంగలో తొక్కి, తెలంగాణ నిధులు స్వాహా చేసి, నదీ జలాలు మళ్లించి ఈ ప్రాంతాన్ని నిర్వీర్యం చేశారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న ముగ్గురు తెలంగాణ వారి పదవీ కాలం కలిపి ఆరేండ్ల మూడు నెలల 11 రోజులు మాత్రమే ఉన్నది.
మరి ఆంధ్ర, రాయలసీమ నాయకులు అర్ధశతాబ్దంపాటు అధికారం చెలాయించారు. సంపన్న, సుభిక్ష తెలంగాణను వివక్షతో వెనుకబాటుతనానికి గురిచేసి, విధ్వంసం సాగించారు. ఈ విషాదానికి ఈ వలస పాలకుల అతి తెలివి, కుటిలత్వమే కారణం కాదు. కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కూడా బాధ్యత వహించాలి. ఎప్పటికప్పుడు కమిటీలు వేసి చేతులు దులుపుకోవడమే కాకుండా, ఆంధ్ర వారి స్వార్థపరత్వం, అవినీతి, అక్రమాలను కూడా కనీసం తగ్గించడానికి ప్రయత్నించలేదు. శాంతియుత సంపన్న తెలంగాణ ప్రాంతం దాదాపు ఆరు దశాబ్దాలు ఇంత వ్యథను అనుభవించటానికి ముఖ్య కారణం కేంద్రంలో అత్యధిక కాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీయే. తెలుగుదేశం తెలంగాణలో ఎప్పుడో కనుమరుగైంది. ఇక ఆ రెండు జాతీయ పార్టీలను ఈ రాష్ట్రం నుంచి వెళ్లగొడితేనే తెలంగాణ శాంతి, సౌఖ్యాలతో మనుగడ సాగించగలదు.
-కనకదుర్గ దంటు