కారేపల్లి, సెప్టెంబర్ 11 : ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో (హెల్త్ సబ్ సెంటర్లు) అన్ని రకాల జ్వర పరీక్షలు చేసేందుకు పరికరాలు అందుబాటులో ఉన్నట్లు హెల్త్ సూపర్వైజర్ బంధం జ్యోతిలక్ష్మి తెలిపారు. ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల పరిధిలోని చీమలపాడు సబ్ సెంటర్‌ను గురువారం ఆమె సందర్శించారు. స్థానిక వైద్య సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి సబ్ సెంటర్లో డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా వంటి జ్వర పరీక్షలు చేయనున్నట్లు తెలిపారు. గ్రామాల్లో ప్రజలు సీజనల్ వ్యాధులకు గురికాకుండా అవగాహన కల్పించాలని వైద్య సిబ్బందికి సూచించారు.
రెండు మూడు రోజుల కంటే ఎక్కువ రోజులు జ్వరం ఉంటే రక్త నమూనాలను సేకరించి పరీక్షలు చేయాలని, అవసరమైతే ఖమ్మం ప్రధాన ఆస్పత్రి ల్యాబ్‌కు పంపించాలన్నారు. పరిసరాల పరిశుభ్రతపై గ్రామస్తులకు అవగాహన కల్పిస్తూ, స్థానిక ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు ఫ్రై డే డ్రై డే కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. గర్భిణీలు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాన్పులు జరుపుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంతకు ముందు సబ్ సెంటర్లోని పలు రికార్డులను ఆమె పరిశీలించారు. ప్రభుత్వ వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్ ఎల్ హెచ్ పి కళ్యాణి, ఏఎన్ఎంలు ముక్తి నాగమణి, ఉష పాల్గొన్నారు.