ఒకప్పుడు ఆ గిరిజన గ్రామాలకు వెళ్లాలంటే గతుకులతో ఉన్న మట్టి రోడ్డే గతి. అసలే అటవీప్రాంతం.. ఆపై మారుమూల గూడేలు. దీంతో రవాణా సౌకర్యం అంతంతమాత్రం. ఇక వానకాలం వచ్చిందంటే చాలు వాగులు పొంగి రోడ్డుపై ప్రవహించేవి. ఆటో అయినా, ద్విచక్రవాహనమైనా బురదలో కూరుకుపోవాల్సిందే.. రోడ్లపైనే వరద నిలవడంతో రోజులకు రోజులు ఆ మార్గంలో రవాణా బంద్. ఇలాంటి కష్టాలకు చెక్ పెట్టింది రాష్ట్ర సర్కార్. రేగళ్ల క్రాస్‌రోడ్ నుంచి మైలారం బంగారుచెలక వరకు సుమారు 20 కిలోమీటర్ల మేర రూ.12 కోట్ల నిధులతో బీటీ రహదారి, 42 చోట్ల కల్వర్టులు నిర్మించింది. దీంతో ప్రయాణికుల కష్టాలు తీరాయి. ఇప్పుడు ఈ మార్గంలో వాహనాలు రయ్.. రయ్ మంటూ దూసుకుపోనున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ) : గిరిజన గ్రామాలన్ని అటువైపే ఉన్నాయి. సుమారు 20 కిలోమీటర్ల పొడవున ఉన్న 15 గ్రామాల ప్రజలు రహదారి లేక ఇప్పటివరకు పడిన బాధలు అన్నీఇన్నీ కావు. ఆ అటవీ ప్రాంతం నుంచి బయటకు రావాలంటే నరకం కనిపించేది. ఆటోలు రావాలన్నా, టూ వీలర్స్ పోవాలన్నా కష్టంగా ఉండే ఆ మారుమూల ప్రాంతానికి కొత్త తారురోడ్డు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం రూ.12 కోట్లు ఖర్చు చేసి రహదారిని పూర్తిచేసింది. లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల క్రాస్‌రోడ్ నుంచి మైలారం బంగారుచెలక వరకు బీటీ రహదారి నిర్మాణం పూర్తయ్యింది. ఈ రోడ్డు పొడవునా సుమారు 42 కల్వర్టులు నిర్మించగా.. ఆయా గ్రామాల్లో సీసీ రోడ్లు వేశారు. దీంతో రేగళ్ల నుంచి మైలారం వరకు వాహనాలు ఇక రయ్.. రయ్ మంటూ దూసుకుపోనున్నాయి.
అంతా అటవీప్రాంతం అయినందున చాలాకాలంగా రహదారులు వేయడానికి సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయి. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు చొరవతో సమస్యను పరిష్కరించారు. అధికారులు, గ్రామస్తులు ఉన్నతాధికారులకు రహదారి సమస్యపై పలుమార్లు విన్నవించిన సంగతి తెలిసిందే. దీంతో రేగళ్ల నుంచి మైలారం వరకు రహదారి విశాలమైన దారిగా మారింది. రహదారికి ఇరువైపులా ఉన్న కల్వర్టులను కూడా పూర్తిచేశారు. గతంలో అటవీశాఖ అక్కడ దారి వేయడానికి అభ్యంతరం తెలపడంతో ఎమ్మెల్యే వనమా అటవీశాఖ అధికారులతో మాట్లాడి సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రహదారి నిర్మాణ పనులకు లైన్‌క్లియర్ అయ్యింది. ఎంతోకాలంగా వేచి చూస్తున్న ఆ ప్రాంతవాసులకు మోక్షం కలిగింది.
మారుమూల ప్రాంతాలకు వెళ్లాలంటే ముఖ్యంగా లోతట్టు వంతెనలు ఉండడంతో కొంచెం ఇబ్బందిగా ఉండేది. రహదారి పనులకు మోక్షం కలగడంతో అక్కడ ఏకంగా 42 కల్వర్టులను నిర్మించారు. వానకాలం కూడా ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా శాశ్వత పరిష్కారం లభించింది.
బంగారుచెలకకు ఆటోలు రావాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్లు. ఆసుపత్రికి వెళ్లాలంటే నరకం కనబడేది. ఇప్పుడు కొత్తగా తారురోడ్డు వేశారు. నిమిషాల్లో కొత్తగూడెం వెళ్తున్నాం. కొన్నిచోట్ల డబుల్ రోడ్డు వేశారు. కొంత ఏరియా సింగిల్ రోడ్డు వేశారు. అయినా విశాలంగా ఉంది. కల్వర్టులు కూడా కట్టారు.
– టి సత్యవతి. బంగారుచెలక.
రహదారి కోసం ఎంతోకాలంగా ఎదురు చూశాం. నేను సర్పంచ్‌గా ఉన్నప్పుడు అధికారులకు చాలాసార్లు విన్నవించాం. ఫారెస్టు సమస్య ఉందని చెప్పారు. చివరికి ప్రభుత్వమే మా సమస్యను పరిష్కారం చూపింది. ఎమ్మెల్యే వనమా సార్‌కు కృతజ్ఞతలు.
– కారం జనార్దన్, మాజీ సర్పంచ్, మైలారం
ఈ దారికి మోక్షం కలగదేమో అనుకున్నాం… కానీ మోక్షం కలిగింది. ఎమ్మెల్యే వనమా సార్ గట్టిగా పట్టుపట్టారు. రోడ్డు మొత్తం పనులు పూర్తి అయ్యాయి. వంతెనలు కూడా పూర్తి చేయడంతో రహదారి అంతా విశాలంగా ఉంది. మారుమూల గ్రామాలకు రహదారులు అన్ని పూర్తయినట్లే.
– కే పుల్లయ్య, బంగారుచెలక