కారేపల్లి,మార్చి 12 : ఈనెల 14 నుంచి జరగనున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు సింగరేణి మండల విద్యాశాఖ అధికారి జయరాజు తెలిపారు. ఖమ్మం జిల్లా సింగరేణి మండల విద్యా వనరుల కేంద్రంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మొత్తం 3 పరీక్ష కేంద్రాలలో 610 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కారేపల్లి ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 200 మంది, కారేపల్లి తెలంగాణ మోడల్ పాఠశాలలో 210 మంది, కోమట్ల గూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(సి.సెంటర్)లో 200 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు చెప్పారు.
ప్రతి సెంటర్కు ఒక చీప్ సూపరింటెండెంట్,డిఓ, 9మంది ఇన్విజిలేటర్లు పరీక్ష నిర్వహణ విధులలో పాల్గొననున్నట్లు తెలిపారు. అదేవిధంగ మూడు సిట్టింగ్ స్కాడ్ లను ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులకు పరీక్ష కేంద్రానికి ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన, నెట్లో డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్లు కలిగి ఉన్న అనుమతి ఇస్తామన్నారు. ప్రతి సెంటర్లో మొబైల్ క్లాక్ రూమ్ ఏర్పాటు చేశామని పరీక్ష నిర్వహణ సిబ్బంది, విద్యార్థులు సెల్ ఫోన్లు, ఇతరత్రా ఎలక్ట్రానిక్ వస్తువులను అక్కడ భద్ర పరుచుకోవాలన్నారు.
అన్ని పరీక్ష కేంద్రాలు సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటాయన్నారు. పరీక్ష కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లు మూసి వేయాలన్నారు. ప్రతి కేంద్రంలో హెల్త్ సిబ్బందిని అందుబాటులో ఉంచినట్లు వివరించారు. దీంతోపాటు విద్యార్థులు పరీక్షలు రాసేందుకు అన్ని రకాల సౌకర్యాలను, సదుపాయాలను కల్పించినట్లు తెలిపారు. దూర ప్రాంతం నుండి పరీక్ష కేంద్రాలకు వచ్చే విద్యార్థుల కొరకు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేయడమైనదన్నారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు సంబంధిత అన్ని శాఖల సిబ్బంది సహకరించాలని మండల విద్యాశాఖ అధికారి కోరారు.