రుద్రంపూర్, జూన్ 15 : ‘యాజమాన్యం మొండివైఖరి వీడి.. కార్మికుల సమస్యలు పరిష్కరించని పక్షంలో సింగరేణి వ్యవస్థను స్తంభింపజేస్తాం. ఈ నెల 22వ తేదీ తర్వాత ఎప్పుడైనా చేపట్టనున్న సమ్మెకు కార్మికులంతా సిద్ధంగా ఉండాలి’ అని గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ నేతలు పిలుపునిచ్చారు. సింగరేణి కొత్తగూడెం ఏరియా పీవీకే 5 గనిలో సోమవారం గేట్ మీటింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆ సంఘం అదనపు ప్రధాన కార్యదర్శి మిర్యాల రంగయ్య మాట్లాడుతూ కార్మికుల సహనాన్ని యాజమాన్యం పరీక్షించొద్దని, ఏళ్లతరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేయడం వల్ల కార్మికుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు. కార్మికులు, వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ వాటి పరిష్కారంపై యాజమాన్యం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని మండిపడ్డారు. కార్మికుల సంక్షేమం, సంస్థ అభివృద్ధి, యువతకు ఉద్యోగావకాశాల కల్పన వంటి కీలక అంశాల కంటే రాజకీయ ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యత ఇస్తోందని, దీంతో సంస్థ మనుగడకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
కార్మిక వర్గం ఇక మౌనంగా ఉండబోదని, అవసరమైతే నిరవధిక సమ్మెకు దిగుతామని, ఇందుకు కార్మికులంతా సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘ నాయకులు మల్లికార్జున్‌రావు, వీరస్వామి, కత్తెర్ల రాములు, గట్టయ్య, ఆఫీస్ బేరర్లు సందబోయిన శ్రీనివాస్, నాగేశ్వరరావు, హుమాయున్, భూక్యా రమేశ్, మధుకృష్ణ, కమల్, సీనియర్ నాయకులు, మండల రాజేశ్వరరావు, సందీప్, సాయి పవన్, రాంచందర్, నారాయణ, లాల్‌సింగ్, కుమార్‌రావు, సంజీవ్, మోహన్, సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.