మణుగూరు టౌన్, జూలై 12 : సింగరేణి బొగ్గు బ్లాకుల వేలం నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో చేపట్టిన దశలవారీ దీక్షల్లో భాగంగా శుక్రవారం జీఎం కార్యాలయం ఎదుట అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి విస్తరణను క్రమక్రమంగా నిలిపివేసి బొగ్గు బ్లాకులను వేలం వేస్తూ సింగరేణి భవిష్యత్‌ను, ఆ ప్రాంత అభివృద్ధిని బీజేపీ ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని, దానిని గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ అడ్డుకుంటుందన్నారు. ప్రైవేటీకరణ జరిగితే మరో పదేళ్ల తర్వాత సింగరేణి సంస్థ కనుమరుగవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మణుగూరు ఓసీ-2తోపాటు మొత్తం 9 గనుల విస్తరణ అనుమతులు, బొగ్గు బ్లాకుల వేలాన్ని రద్దు చేయాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశామన్నారు. అనంతరం బొగ్గు బ్లాకుల వేలాన్ని రద్దు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఏరియా జీఎం దుర్గం రాంచందర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచి సెక్రటరీ వై.రాంగోపాల్, నాయకులు రామనర్సయ్య, మేకల ఈశ్వర్, నాగరాజు, ఆదర్ల సురేందర్, సీపీఐ నాయకులు మున్నా లక్ష్మీకుమారి, సర్వర్, దుర్గ్యాల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.