అశ్వాపురం, ఫిబ్రవరి 20: పత్తి విక్రయించేందుకు కూపన్ ఇవ్వడానికి ఓ రైతు నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా మండల వ్యవసాయాధికారిని ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఈ ఘటన అశ్వాపురంలో గురువారం చోటు చేసుకుంది. ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్ కథనం ప్రకారం.. ఓ రైతు తన పత్తిని విక్రయించేందుకు కూపన్ ఇవ్వాలని మండల వ్యవసాయాధికారి సాయి శంతన్కుమార్ను కోరాడు. దీంతో ఆయన కూపన్ ఇచ్చేందుకు రూ.30 వేలు డిమాండ్ చేశాడు.
ఈ క్రమంలో ఆ రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించి పరిస్థితిని వివరించాడు. వారు పన్నిన పథకం ప్రకారం.. వ్యవసాయాధికారి రైతు నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా అక్కడే మాటువేసిన ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వ్యవసాయాధికారి సాయి శంతన్కుమార్ను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చనున్నట్లు ఏసీబీ డీఎస్పీ రమేశ్ తెలిపారు. ఎవరైనా లంచం అడిగితే టోల్‌ఫ్రీ నంబర్ 1064కు డయల్ చేయాలని సూచించారు. దాడుల్లో డీఎస్పీ వెంట ఇన్స్పెక్టర్లు శేఖర్, సట్ల రాజు ఉన్నారు.