ఖమ్మం, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వ్యవసాయశాఖ నానాటికీ అప్డేట్ అవుతున్నది. మారుతున్న సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా శాఖలో మార్పులు తీసుకువస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని వ్యవసాయశాఖ విధి నిర్వహణకు ‘లాగర్ యాప్’ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మూడు నెలల క్రితం వినియోగంలోకి తీసుకొచ్చింది. దీనిలో భాగంగా ఏఈవోలు రోజువారీ విధులను ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేస్తున్నారు. దీంతో విధుల్లో పారదర్శకత వచ్చింది. జిల్లావ్యాప్తంగా 130 క్లస్టర్లకు చెందిన ఏఈవోలు ఇప్పుడు మొబైల్ ఫోన్లో ఈ యాప్‌ను వినియోగిస్తున్నారు. వీరు ప్రతిరోజూ తాము వెళ్లదలుచుకున్న రెవెన్యూ గ్రామం వివరాలను ముందే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపిక చేసుకున్న తర్వాత జీపీఎస్ యాక్టివ్ అవుతుంది. దీంతో ఏఈవోలు ఉన్నచోటు పై అధికారులకు ఇట్టే తెలిసిపోతుంది. ఒకవేళ ఏదేని అధికారిక కార్యక్రమాలు, సమావేశాలకు వెళ్లాల్సి వస్తే ఇదే విషయాన్ని ఆన్లైన్ నమోదు చేసేందుకు యాప్‌లో అవకాశం ఉంటుంది.. ఒకవేళ ఆ ఏఈవో సెలవులో ఉంటే ఇదే విషయాన్ని ఆన్లైన్లో నమోదు చేయవచ్చు.
అంశాల వారీగా నమోదు..
క్లస్టర్ పరిధిలో పని చేస్తున్న ఏఈవోలు నిత్యం వ్యవసాయశాఖ సూచించిన విధంగా 21 అంశాలపై విధులు నిర్వహించాల్సి ఉంటుంది. రైతువేదికల్లో రైతులతో నిర్వహించిన సమావేశాలు, రికార్డులు, పంటల సాగు లెక్కల వివరాల సేకరణ, మట్టి నమూనాల సేకరణ, పీఎం కిసాన్ ఆప్డేట్, రైతుబీమా, రైతుబంధు, రైతు విజ్ణాన యాత్రలు, శాస్త్రవేత్తలతో కలిసి పంటల పరిశీలన, రైతులతో ముఖాముఖి, పంట కొనుగోలు కేంద్రాల పరిశీలన, విత్తనాలు, ఎరువుల పంపిణీ తదితర అంశాల గురించి ఏఈవోలు యాప్‌లో అపలోడ్ చేయాల్సి ఉంటుంది. వీటిలో ఏఈవోలు ఏదైనా ఒక పని చేయాల్సి ఉంటుంది. చేసిన పనికి సంబంధించిన వివరాలను యాప్‌లో అడిగే ఆప్షన్స్‌కు అనుగుణంగా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఒకటి కంటే ఎక్కవ పనులు చేసినా, లేదా ఒక్క పని మాత్రమే చేసినా వివరాలను ఆన్లైన్ చేయాల్సి ఉంటుంది. వరుసగా మూడు రోజుల్లో అధికారులు ఒక్క పని వివరాలను కూడా అప్లోడ్ చేయకపోతే తక్షణం ఉన్నతాధికారులు స్పందిస్తారు. వివరాలు అప్లోడ్ చేయని అధికారులకు మెమోలు అందజేశారు. ఏ ఏఈవో అయినా కెరీర్ మొత్తంలో మూడు సార్లు మెమోలు తీసుకుంటే వారిని సస్పెండ్ చేస్తారు.