రఘునాథపాలెం, జూన్ 11 : ఖమ్మం జిల్లా రైతులకు తొలకరి జల్లులు పడగానే విత్తనాలు వేయడం అలవాటు. అయితే ఈ వానకాలంలో ‘ఎల్‌నినో’ ప్రభావంతో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లా వ్యవసాయ శాఖ అప్రమత్తమైంది. జూలై, ఆగస్టులో సాధారణ వర్షపాతం నమోదు కాకుంటే ఆరుతడి పంటలు సాగు చేయాలని అధికారులు రైతులకు సూచిస్తున్నారు. ఈ మేరకు అన్నదాతలు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించేలా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు వ్యవసాయ శాఖ సిద్ధమైంది.
ఖమ్మం జిల్లా అంటేనే వ్యవసాయానికి పెట్టింది పేరు. వ్యవసాయంపైనే ఆధారపడి రైతులు జీవనం సాగిస్తున్నారు. ఈ వానకాలం సీజన్లో 6.48 లక్షల ఎకరాల్లో పలు రకాల పంటలు సాగు కానున్నట్లు అధికారులు అంచనా వేశారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికను ఇప్పటికే ఖరారు చేశారు. అయితే ఈ ఏడాది వానకాలం సీజన్‌కు ‘ఎల్‌నినో’ ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు హెచ్చరికలు జారీ చేశారు. అదే జరిగితే రైతులు ఆరుతడి పంటలను మాత్రమే సాగు చేయాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.
అందుకు సంబంధించిన విత్తనాలను సిద్ధంగా ఉంచేందుకు కసరత్తు చేస్తున్నారు.. గత ఏడాది మే 26నే రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని, ఈ ఏడాది ఆలస్యంగా ఈ నెల మూడో వారంలో వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో వర్షాలు కురవాల్సిన సమయంలో కాకుండా, ఒకేసారి భారీ వర్షం కురిసి పెద్దఎత్తున వరదలు వచ్చే అవకాశం ఉంటుందని, అలాంటి పరిస్థితి ఆగస్టు 15 వరకు జరిగితే యథావిథిగా వరిసాగు చేసుకునే పరిస్థితి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
సాధారణ వర్షపాతం కన్నా తక్కువగా వర్షాలు కురిస్తే మూడు విభాగాలుగా ప్రణాళికలను మారుస్తూ ముందుకు సాగాలనే నివేదికను జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు సిద్ధం చేశారు. ఇందులో భాగంగా జూలై 15వ తేదీ వరకు వర్షం పడకపోతే వేసుకోవాల్సిన పంటల ప్రణాళిక, జూలై 30వరకు వర్షం పడకపోతే వేసుకోవాల్సిన పంటలు, ఆగస్టు 15 వరకు వర్షం పడకపోతే వేసుకోవాల్సిన పంటలపై ప్రణాళికను తయారు చేశారు.
వర్షాలు ఆలస్యం కావడం వల్ల వరి విత్తుకునే రైతులు నాటుపెట్టే పద్ధతికి బదులుగా వెదజల్లే విధానాన్ని పాటించాలని, స్వల్పకాలిక వరి విత్తనాలు అయిన బీపీటీ-5204, ఆర్ఎన్ఆర్-15048, డబ్ల్యూజీఎన్ఎల్-44, జేజ.ఈఎల్- 1978, ఎంటీయూ-1010, జైశ్రీరామ్, హెచ్ఎంటీ సోనా వంటి రకాలను వేసుకోవాలని సూచిస్తున్నారు. వర్షాభావం వల్ల వరి, మొక్కజొన్న, పత్తి తదితర పంటలు వేసుకోవాల్సిన విస్తీర్ణం కన్నా తగ్గినట్లయితే వాటిస్థానంలో మినుము, బొబ్బెర, కంది, వేరుశనగ పంటలను వేయాలని ప్రణాళిక సిద్ధం చేశారు.
ఈ మేరకు జిల్లావ్యాప్తంగా గ్రామసభలను నిర్వహించి రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించేందుకు వ్యవసాయ శాఖ సిద్ధమైంది. ప్రస్తుతం పత్తి వేసే రైతులు తొందరపడి విత్తనాలు వేయవద్దని, తగినంత తేమ ఉన్నప్పుడే వేసుకోవాలని 60-70 సెం.మీ వర్షం పడినప్పుడు వేసుకోవాలని సూచిస్తున్నారు. జూలై 15వ తేదీ వరకు పత్తి వేసుకోవచ్చునని సూచిస్తున్నారు.
ఈ ఏడాది ఎల్‌నినో ముప్పు ఖమ్మం జిల్లాపై అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. దీంతో జిల్లాలో సాగు చేయాల్సిన పంటలపై ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసి రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని గ్రామాల్లో సభలు నిర్వహించి రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గుచూపేలా ప్రోత్సహిస్తున్నాం. రైతులు తొందరపడి విత్తనాలు అప్పుడే వేయవద్దు.
– ధనసరి పుల్లయ్య, ఖమ్మం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి