కూసుమంచి, జూలై 27 : ఖమ్మం జిల్లాలో వానకాలం వరినాట్లు జోరందుకున్నాయి. గత వారంరోజులుగా వర్షాలు కురుస్తుండడంతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. భూగర్భ జలాలు పెరిగి బావులు, బోర్లలో పుష్కలంగా నీరు ఉండడంతో సాగు సంబురంగా సాగుతోంది.
కాలువ కింద ఆయకట్టుతోపాటు బావులు, బోర్ల కింద పొలాల వద్ద వందల సంఖ్యలో రైతులు రోజంతా పనిచేస్తూ కనిపిస్తున్నారు. నాగార్జున సాగర్ జలాశయం నిండడంతో జిల్లాలోని 2.54 లక్షల ఎకరాల రైతులు సంతోషంగా సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. సాగర్ ఆయకట్టుతోపాటు భక్త రామదాసు ఎత్తిపోతల కింద పుష్కలంగా నీరు అందుతుండటంతో గ్రామాల్లోని చెరువుల ఆయకట్టు కింద వరినాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
ఆరుగాలం శ్రమించే అన్నదాతలకు తుపాన్ ఊరటనిచ్చింది. ఎగువన పడిన వర్షాలతో నాగార్జునసాగర్ జలాశయం నిండుకుండను తలపిస్తుండడంతో పూర్తి ఆయకట్టుకు సాగునీరు వస్తాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని సాగర్ ఆయకట్టు కింద ఉన్న 2.54 లక్షల ఎకరాల్లో వేలాది మంది రైతులు పొలం పనుల్లో ముమ్మరంగా నిమగ్నమయ్యారు. వెదజల్లే పద్ధతి, డ్రమ్ సీడ్‌తోపాటు పాత విధానంలో వరినాట్లు పెడుతున్నారు.
జిల్లాలో 17 మండలాలకు పాలేరు జలాశయం నుంచి సాగునీటిని అందిస్తున్నారు. ఇప్పటికే నార్లు పోసి నాట్లు పెడుతున్న రైతులు కొందరైతే, నారును ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేస్తున్న రైతులు మరికొందరు. బురద పొలాలను ట్రాక్టర్లు, ఎద్దులతో దున్ని కరిగట్టు చేస్తున్నారు. తెల్లవారింది మొదలు పొద్దుపోయే వరకు పొలాల వద్ద రైతుల సందడి కనిపిస్తున్నది. వేలాది మంది రైతులు సమయం వృథా చేయకుండా వ్యవసాయ పనుల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. అయితే రైతుల డిమాండ్‌కు తగ్గట్టుగా యూరియా దొరకకపోవడంతో కొంత నిరాశలో ఉన్నారు. సరిపడా యూరియాను అందించాలని ప్రభుత్వాన్ని రైతు సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.