రఘునాథపాలెం, మార్చి 4: మిర్చి ధరల పతనానికి ముమ్మాటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తప్పిదమే కారణమని వ్యవసాయ శాస్త్రవేత్త శరత్‌బాబు స్పష్టం చేశారు. వ్యవసాయ ఉత్పత్తుల్లో ప్రధానమైన మిర్చి ఎగుమతులపై ప్రభుత్వాలు చొరవ చూపకపోవడంతోనే ఈ ఏడాది మిర్చి ధరలు భారీగా తగ్గాయని అన్నారు. అంతేగాక, నిరుడు పండించిన మిర్చి పంట పెద్ద మొత్తంలో నిల్వ ఉండడం, ప్రపంచ వ్యాప్తంగా మిర్చి దిగుమతి చేసుకునే దేశాల్లో పలు సంక్షోభాలు ఏర్పడడం వంటివి కూడా మరికొన్ని కారణాలుగా ఉన్నట్లు చెప్పారు.
‘మిర్చి ధరల పతనం-పరిష్కార మార్గం’ అనే అంశంపై తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం జడ్పీ మీటింగ్ హాల్లో మంగళవారం నిర్వహించిన సెమినార్లో శాస్త్రవేత్త శరత్‌బాబు ప్రధాన వక్తగా మాట్లాడారు. భారతదేశం దిగుమతి సుంకాన్ని పెంచిందనే కారణంతో కొన్ని దేశాలకు ఎగుమతులు నిలిచిపోయాయని అన్నారు. దీనికితోడు ఈ ఏడాది తామర పురుగు, చీడపీడల వల్ల మిర్చి దిగుబడి కూడా చాలా వరకూ తగ్గిందని అన్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కోసం రైతాంగ ఉద్యమాలు అవసరమని అభిప్రాయపడ్డారు. రైతులే ఎగుమతి చేసుకుంటే దళారీ వ్యవస్థతో ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు. మిర్చి ధర విషయంలో కేంద్ర మంత్రి క్వింటాకు రూ.11,781 మద్దతు ధర ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
రైతుల కోసం ఐక్యంగా ఉద్యమిద్దాం..
ఐక్య పోరాటాలతోనే వ్యవసాయ రంగ సమస్యలు పరిష్కారమవుతాయని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు, రైతు సంఘాల నేతలు అభిప్రాయ పడ్డారు. సెమినార్లో ఆయన మాట్లాడుతూ.. మిర్చి ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో ఉందని గుర్తుచేశారు. కానీ ఈ ఏడాది మిర్చి సాగు చేసిన రైతులకు పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఖమ్మంలో మిర్చి బోర్డు ఏర్పాటు చేసి క్వింటాకు రూ.25 వేల చొప్పున నాఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. దొండపాటి రమేశ్ అధ్యక్షతన జరిగిన ఈ సెమినార్లో వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు చంద్రావతి, రైతు సంఘాల నాయకులు బాగం హేమంతరావు, కొండపర్తి గోవిందరావు, నల్లమల వెంకటేశ్వరరావు, పోతినేని సుదర్శన్‌రావు, గుర్రం అచ్చయ్య, దండి సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
కొనుగోళ్లలో రైతులను మోసగిస్తే కఠిన చర్యలు
రఘునాథపాలెం, మార్చి 4: నాణ్యమైన మిర్చిని ధర తగ్గించి కొనుగోలు చేస్తే ఉపేక్షించేది లేదని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ వ్యాపారులను హెచ్చరించారు. ఖమ్మం ఏఎంసీకి మిర్చి పంటను తీసుకొచ్చే రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదనే ఆరోపణల నేపథ్యంలో మంగళవారం ఆయన మిర్చియార్డును ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోళ్లను పరిశీలించారు. గిట్టుబాటు ధరకే మిర్చి కొనుగోలు చేయాలని వ్యాపారులకు సూచించారు. మిరపకాయలను పట్టుకుని తేమ శాతాన్ని, నాణ్యతను పరిశీలించారు.
పంట నాణ్యంగానే ఉన్నప్పటికీ తక్కువ ధర ఎందుకు చెల్లిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కలెక్టర్ ఎదుట రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. జెండాపాటకు రూ.వేలల్లో వ్యత్యాసం చూపిస్తూ వ్యాపారులు తమ పంటను కొనుగోలు చేస్తున్నారని, దీంతో తమకు తీవ్రంగా నష్టాలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి కలెక్టర్ స్పందిస్తూ.. ధరల విషయంలో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రైతులు గిట్టుబాటు ధరకు పంటలను విక్రయించుకునే వరకూ నిరంతర పర్యవేక్షణ చేపడుతానని అన్నారు. డీఎంవో అలీమ్, మార్కెట్ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.