చుంచుపల్లి, మే 26 : సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం వైద్య శిబిరాలు నిర్వహించేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ భాస్కర్నాయక్ ఆదేశించారు. పెనగడప పీహెచ్సీని సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న వర్షాకాలంలో వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న ప్రాంతాల్లో నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని, ఇందుకోసం యాక్షన్ ప్లాన్ రూపొందించాలన్నారు.
జాతీయ ఆరోగ్య కార్యక్రమాలైన క్షయ, మలేరియా, వ్యాధి నిరోధక టీకాలు, అసంక్రమిత వ్యాధులు తదితర వాటిపై లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. ఈ నెల 21 నుంచి జిల్లాలో కొనసాగుతున్న ప్రత్యేక వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు. అనంతరం పీహెచ్సీ ఆవరణలో ఇంకుడు గుంతల నిర్మాణాన్ని పరిశీలించారు. ఆయన వెంట మెడికల్ ఆఫీసర్ నేహా అంబ్రిన్, నర్సింగ్ ఆఫీసర్ సమ్మక్క, ఫార్మాసిస్టు సుభద్రాదేవి, ల్యాబ్ టెక్నీషియన్ ప్రణీత్ తదితరులు ఉన్నారు.