చర్ల, సెప్టెంబర్ 16: ఏజెన్సీ గూడేలకు ప్రాథమిక వైద్యం నేటికీ దూరంగానే ఉంటోంది. స్వాతంత్య్ర వజ్రోత్సవాలను వైభవంగా జరుపుకున్నా.. ఆదివాసీలకు ప్రాథమిక వైద్యం ఇంకా అందని ద్రాక్షనేగా మిగులుతోంది. ఈ చిత్రాలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. నగరీకరణలు, నాగరిక సమాజాలు విస్తరిస్తున్న వేళ ఆదివాసీ అతివలు అమ్మతనాన్ని ఆస్వాదించేందుకు అనంత కష్టాలు పడాల్సి వస్తోంది.
ముఖ్యంగా జన్మనిచ్చేందుకు వారు మరో జన్మనెత్తాల్సినంత దయనీయం. ఒరుపైనా, వర్షమైనా వారికి జెట్టీలే దిక్కవుతున్నాయి. పురిటినొప్పుల వేళ వారు ప్రాథమిక వైద్యం పొందాలన్నా కిలోమీటర్ల మేర నడవాల్సిన దుస్థితి. భుజాలు మార్చుకుంటూ యువకులు పరుగులు పెట్టాల్సి దయనీయ స్థితి.
పురిటినొప్పులతో అడవి మార్గంలో..
భద్రాద్రి జిల్లా ఏజెన్సీ మండలమైన చర్లలోని బట్టిగూడెం గ్రామానికి చెందిన రవ్వ సుబ్బమ్మ, రవ్వ దేవిలకు సోమవారం పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. అందుబాటులో వైద్యశాల లేదు. సత్యనారాయణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వారిని తరలించేందుకు ఆదివాసీ యువకులు అనేక పాట్లు పడ్డారు. ఇద్దరినీ వేర్వేరు జెట్టీలపై మోసుకుంటూ మూడు కిలోమీటర్ల మేర నడిచి వచ్చారు.
అటవీ మార్గం ద్వారా ప్రయాణించి రోడ్డు పాయింట్ ఉన్న తిప్పాపురం వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి అంబులెన్స్ ద్వారా సత్యనారాయణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు.