భద్రాచలం, జూలై 13: ఏళ్లుగా పోడు సాగు చేసుకుంటున్న ఆదివాసీ గిరిజనులకు ఆ భూములకు పట్టాలు ఇవ్వాలని, అటవీ అధికారుల నిర్బంధాలు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో భద్రాచలం పట్టణంలో ఆదివాసీ గిరిజనులు సోమవారం భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఐటీడీఏ ప్రధాన ద్వారం వద్ద ధర్నా చేపట్టారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కారం పుల్లయ్య అధ్యక్షతన జరిగిన సభలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బండారు రవికుమార్ మాట్లాడుతూ మోడీకి, రేవంత్‌రెడ్డికి మధ్య పెద్ద తేడా కనిపించడం లేదని, మోడీ విధానాలనే రేవంత్ అవలంబిస్తున్నారని ఆరోపించారు.
కేసీఆర్ హయాంలో నాలుగున్నర లక్షల ఎకరాలకు పట్టాలు ఇస్తే.. ఎన్నికల ముందు 8 లక్షల ఎకరాలకు పట్టాలిస్తామన్న రేవంత్‌రెడ్డి గెలిచాక 8 ఎకరాలకు కూడా పట్టాలు ఇవ్వలేదని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన పట్టాదారులపై కూడా ప్రస్తుత కాంగ్రెస్ హయాంలో అటవీ శాఖ అధికారులు కేసులు నమోదు చేస్తున్నారంటే వీరి పాలన ఎంత అధ్వానంగా ఉంతో అర్థమవుతుందన్నారు. మాజీ ఎంపీ డాక్టర్ మిడియం బాబురావు మాట్లాడుతూ.. ఆదివాసీ గిరిజనుల సాగులో నాలుగు ఎకరాల భూమి ఉంటే.. రేవంత్‌రెడ్డి రెండు ఎకరాలు వెనకి తీసుకొని మొకలు వేస్తామని చెప్పడం దుర్మార్గమన్నారు.
అటవీ హకుల చట్టం పరిరక్షణ కోసం గిరిజనులు మరో ఉద్యమానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం ఐటీడీఏ పీవో రాహుల్‌కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు, నాయకులు అన్నవరపు కనకయ్య, ఏజే రమేశ్, అన్నవరపు సత్యనారాయణ, కొలగాని బ్రహ్మచారి, రేపాకుల శ్రీనివాస్, లికీ బాలరాజు, మందలపు జ్యోతి, గడ్డం స్వామి, నిమ్మల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.