నేరడిగొండ, మే 29 : పల్లె ప్రగతి కార్యక్రమాల నిర్వహణకు అధికారులు కార్యాచరణను సిద్ధం చేశారు. గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహిస్తున్నది. గ్రామస్తులు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమావేశమై చేపట్టాల్సిన అభివృద్ధి పనులను నిర్ణయిస్తారు. ఈ నివేదిక ఆధారంగా కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. జూన్ 3 నుంచి 18 తేదీ వరకు పల్లె ప్రగతి కార్యక్రమాలు నిర్వహించేలా షెడ్యూల్ ప్రకటించారు. కార్యక్రమ విధివిధానాలను వివరించేందుకు అధికారులు పంచాయతీ కార్యదర్శులతో సమావేశం సైతం నిర్వహించారు. గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయడంతో పాటు పాడుబడ్డ బావులను పూడ్చడం, శిథిలావస్థలోని ఇళ్లను పూర్తిగా కూల్చివేయనున్నారు. మురుగు కాల్వలను శుభ్రం చేయడంతో పాటు ముళ్లపొదలను తొలగించనున్నారు. ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించుకునేలా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు.
స్వచ్ఛ గ్రామాల ఏర్పాటుకు పల్లె ప్రగతిలో ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకో ట్రాక్టర్ కేటాయించింది. ప్రతి ఇంటి నుంచి తడి,పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి నేరుగా సెగ్రిగేషన్ షెడ్లకు తరలిస్తున్నారు. గ్రామాల్లో డంప్ యార్డులను నిర్మించి మౌలిక వసతులు కల్పించారు. పంచాయతీల్లో మల్టీపర్పస్ వర్కర్లను నియమించారు. వీరితో రోజూ చెత్త చెదారాన్ని డంప్ యార్డులకు తరలిస్తున్నారు. ఈ విడుత పల్లె ప్రగతిలో శానిటేషన్, ప్లాంటేషన్ పైనే దృష్టి పెట్టనున్నారు. కాల్వల వెంట మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకున్నారు. ఒక్క నేరడిగొండ మండలంలోనే 3.20 లక్షల మొక్కలు నాటేలా కార్యాచరణను రూపొందించారు. గత పల్లె ప్రగతిలో మిగిలిన పనులను ఈ పల్లె ప్రగతిలో పూర్తి చేసేలా ఆదేశాలు జారీ చేశారు.
పంచాయతీలో సర్పంచ్లు చేసిన ప్రతి పనికి బిల్లులు చెల్లిస్తే మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఆస్కారం ఉంటుంది. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా పల్లెల్లో ఎంతో అభివృద్ధి కనిపిస్తున్నది. అధికారులు ఈ విషయంలో కొంత చొరవ చూపాలి. ఈ విషయంలో తమ సహకారం అధికారులకు ఎప్పుడూ ఉంటుంది.
అడిగం రాజు, సర్పంచ్, వాంకిడి
ప్రభుత్వం ఏటా గ్రామాల్లో నిర్వహించే పల్లె ప్రగతి కార్యక్రమాలు గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి. పల్లెలు ప్రగతి దిశగా పయనిస్తున్నాయి. ప్రభుత్వం చేపడుతున్న ప్రతిష్టాత్మక నిర్ణయాలు గ్రామాల్లో ఎంతో ప్రభావితం చేస్తున్నాయి. పల్లె ప్రగతి కార్యక్రమంతో మరింత అభివృద్ధికి నోచుకోనున్నాయి.
సోలంకి గీత, సర్పంచ్, కిష్టాపూర్
జూన్ 3 నుంచి 18 వరకు చేపట్టనున్న పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రభు త్వం ఆదేశాల మేరకు కొనసాగిస్తాం. ఈ కార్యక్రమాలు విజయవంతం చేసేందుకు ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు సహకరించాలి. పల్లెలను బాగు చేసుకునేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి.
అబ్దుల్ సమద్, ఎంపీడీవో, నేరడిగొండ