బోథ్, మే 29: బోథ్ మండలంలో వానకాలం పంటల సాగు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మృగశిర కార్తెకు పది రోజుల గడువు మాత్రమే ఉండడంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. పత్తి కట్టె, జొన్న మొదళ్లు, తొగరి కట్టెలు ఏరడం వంటి పనులు చేస్తున్నారు. ఈ పనులు పూర్తయిన రైతులు ట్రాక్టర్లు, ఎడ్ల నాగళ్లతో దుక్కులు దున్నుతున్నారు. రొటోవేటర్లతో భూమిని చదును చేయిస్తున్నారు. 2021-22 సంవత్సరానికి గాను 45,324 ఎకరాల్లో రైతులు వివిధ రకాల పంటలు సాగు చేశారు.
అత్యధికంగా 29,597 ఎకరాల్లో పత్తి, 12,718 ఎకరాల్లో సోయాబీన్, 2,557 ఎకరాల్లో కంది (తొగరి), 53 ఎకరాల్లో మక్క, 44 ఎకరాల్లో జొన్న, 47 ఎకరాల్లో పెసర తదితర రకాల పంటలు వేశారు. పత్తికి ఈ యేడు రికార్డు స్థాయిలో ధర పలకడంతో పాటు ప్రస్తుతం క్వింటాలుకు మార్కెట్లో రూ. 14 వేలు పలుకుతుండడంతో అత్యధికంగా ఈ సంట సాగు వైపు రైతులు మొగ్గు చూపే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సోయాబీన్‌కు సైతం క్వింటాలుకు రూ 6,500 నుంచి రూ 7500ల వరకు ధర పలికినా గత ఏడాది కంటే సాగు విస్తీర్ణం స్వల్పంగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి.
పత్తి విస్తీర్ణం 35 వేల వరకు చేరవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వానకాలం మొదలవడానికి వారం, పది రోజులు మాత్రమే ఉండడంతో అన్నదాతలు పొలం బాట పడుతున్నారు. తుక్కులు ఏరడం, దుక్కులు దున్నడం, భూమిని చదును చేయడం వంటి పనులు చేస్తున్నారు. తొలకరి వర్షాలు పడగానే నేలలో తేమ శాతాన్ని చూసి విత్తనాలు వేయడానికి వీలుగా భూములు సిద్ధం చేసుకుంటున్నారు. పత్తి, సోయాబీన్, కంది తదితర విత్తనాలతో పాటు డీఏపీ, యూరియా, కాంప్లెక్స్ ఎరువులు కొనుగోలు చేసి ఇళ్లకు తీసుకు వస్తున్నారు.
రైతులు పంట మార్పిడి విధానం పాటిస్తే బాగుంటుంది. పత్తి సాగు చేసిన పొలంలో సోయాబీన్, సోయా భూమిలో పత్తి వేస్తే దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. రసాయనిక ఎరువుల కంటే సేంద్రియ ఎరువుల వాడకంతో భూసారం దెబ్బతినకుండా ఉంటుంది. ఈ యేడు పత్తి విస్తీర్ణం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వెండి విశ్వామిత్ర, ఏవో, బోథ్