నిర్మల్ అర్బన్, మే 29 : జిల్లాలో దొంగల అలజడి మళ్లీ మొదలైంది. కొన్నేళ్లుగా జిల్లాలో వారి అలికిడి లేకుండా పోయిందనుకుంటున్న తరుణంలో ఒక్కసారిగా ఖానాపూర్లో వరుసగా జరుగుతున్న ఘటనలతో ఉలిక్కిపడినట్లయ్యింది. జిల్లాలోని పలు చోట్ల ఒక్కో రోజు వరుసగా రెండు మూడు ఇండ్లల్లో చోరీలు జరుగుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. శివారు ప్రాంతాల్లోని ఇండ్లు, తాళం వేసి ఉంటున్న ఇండ్లను దొంగలు టార్గెట్ చేస్తున్నారు. దీంతో ఇండ్ల నుంచి ఎవరూ బయటకు వెళ్లడం లేదు. ఒకవేళ వేరే ఏ ఊరికి వెళ్లాల్సి వస్తున్నా తిరిగి రాత్రి వరకు ఇంటికి చేరుతున్నారు.
జిల్లాలోని ఖానాపూర్లో వరుస దొంగతనాలు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఖానాపూర్లోని విద్యానగర్లో ఏప్రిల్ 15న వరుసగా మూడు ఇళ్లల్లో చోరీలు జరిగాయి. రూ.1.10 లక్షల నగదు ను దుండగులు ఎత్తుకెళ్లారు. మే 7న పద్మావతినగర్లోని రెండు ఇళ్లల్లో చోరీలు జరిగాయి.ఓ ఇంట్లో రూ. 2లక్షలు, మరో ఇంట్లో బంగారం, రూ.8 వేలు అపహరించారు. ఈనెల 27న రాత్రి శాంతినగర్ కాలనీలో ఓ ఇంట్లో 60 గ్రాముల బంగారం, 24 గ్రాముల వెండి, నగదు ఎత్తుకెళ్లారు. ఒక్కో వార్డులో ఒకే రోజు మూడు ఇళ్లల్లో వరుసగా చోరీలు జరిగాయి. ఎవరూ లేని ఇండ్లపై పగటి సమయంలో రెక్కీ నిర్వహిస్తూ రాత్రి వేళల్లో చోరీ చేస్తున్నారు. శివారు ప్రాంతాల్లోని ఇండ్లను సైతం టార్గెట్ చేస్తున్నారు. గతంలో నిర్మల్లో సైతం శివారు కాలనీలో ఒంటరిగా ఉన్న ఇండ్లను టార్గెట్ చేసి, చోరీలకు పాల్పడ్డారు.
దొంగలు ఇండ్లతో పాటు ఆలయాలను సైతం వదలడం లేదు. అందిన కాడికి దోచుకుని వెళ్తుండడమే లక్ష్యంగా తమ పని కానిస్తున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఇటీవల పట్టణంలోని శాంతినగర్ భక్త హనుమాన్ ఆలయంలో చోరీ జరిగింది. ఆలయ కమిటీ నిర్వాహకులు గుడిలో సీసీ కెమరాలు ఏర్పాటు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. సీసీ కెమెరాల వైర్లను కత్తిరించారు. వాటిని పైకి తిప్పి ఆలయం తాళం పగులగొట్టి, హుండీలోని నగదును దోచుకెళ్లారు. ఏడాది హుండీ ఆదాయం దాదాపు రూ.30 వేల వరకు ఉంటుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఇటీవల లక్ష్మణచాంద మండలం బాబాపూర్ ఆలయంలో సైతం దొంగలు పడి నగదును దోచుకెళ్లారు. ఇలా భద్రత లేని ఇండ్లు, ఆలయాల్లో దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు.
వేసవి సెలవుల నేపథ్యంలో సొంత ఊరుకు, బంధువుల ఇండ్లకు, విహార యాత్రలకు, తీర్థయాత్రలకు వెళ్లే సమయంలో ఆయా ప్రాంతాల్లోని అనుమానాస్పద వ్యక్తుల వివరాలను పోలీసులకు వివరించినట్లయితే చోరీలు జరుగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటారు.
ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లే సమయాల్లో విలువైన బంగారం, వెండి ఆభరణాలు నగదును ఉంచి వెళ్లవద్దు. చాలా వరకు వీటికోసమే దొంగతనాలకు పాల్పడుతున్నారు. అలాగని ప్రయాణం చేసే సమయంలో కూడా వెంట తీసుకెళ్లవద్దు. వాటిని లాకర్లలో దాచుకోవాలి.లాకర్ సదుపాయం లేని వాళ్లు దొంగలు ఊహించని ప్రదేశాల్లో దాచుకోవాలి.