ఉట్నూర్ రూరల్, మే 29: యాసంగిలో వరి పండించిన రైతులు దళారుల చేతుల్లో మోసపోకుండా ఉండడానికి ప్రభుత్వం మహిళా సంఘాల ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. జిల్లాలో ఉట్నూర్ మహిళా సంఘం అధ్వర్యంలో రెండు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. రైతులను అన్ని విధాలా ఆదుకునేందుకు, దోపిడీ నుంచి విముక్తి కల్పించేందుకు ప్రభుత్వమే ఐకేపీ మహిళా సంఘాల ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. యాసంగిలో వరి ఉట్నూర్‌లో 50 ఎకరాలు, దంతన్పెల్లిలో 30 ఎకరాలు, బీర్సాయిపేట్లో 20 ఎకరాల్లో సాగు చేశారు.
యాసంగిలో వరి మండలంలోనే పండించడంతో ప్రభుత్వం బీర్సాయిపేట్, ఉట్నూర్‌లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ఏగ్రేడ్‌కు రూ. 1,960, బీ గ్రేడ్‌కు రూ. 1,940 చెల్లిస్తున్నది. ఆయా కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా ఉండడానికి జిల్లా స్థాయి అధికారులు, ఐకేపీ, వ్యవసాయ అధికారులు తరచూ పర్యవేక్షిస్తున్నారు. ధాన్యం విక్రయించిన రైతులకు సకాలంలో డబ్బులు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. తూకం వేసిన ధాన్యాన్ని వెంటవెంటనే మిల్లులకు తరలిస్తున్నారు.
ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రైవేట్ వ్యాపారులు ధాన్యం కొనుగోలు చేసినా వారు పెట్టిందే రేటు. దీంతో రైతులు నష్టపోయేవారు. ధాన్యం డబ్బులు కూడా వాయిదాల పద్ధతిలో ఇచ్చేవారు. ప్రస్తుతం ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర చెల్లించడంతో పాటు డబ్బులు వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తుండడంతో రైతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కొనుగోలు కేంద్రాలకు వచ్చిన వడ్లను తేమశాతం చూసి తూకం వేస్తున్నారు. రైతులు వడ్లను కల్లాల్లోనే ఆరబెట్టుకొని తీసుకరావాలని తెలియజేశాం. వారికి ఇబ్బంది కలుగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. గోనె సంచులు అందుబాటులో ఉన్నాయి.
రాథోడ్ గణేశ్, ఏవో
నేను రెండెకరాల్లో వరి పండించిన. దాదాపు 24 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ప్రస్తుతం చేనులోనే వడ్లు ఆరబెట్టిన. ఎండిన తర్వాత కొనుగోలు కేంద్రానికి తీసుకుపోత. ప్రభుత్వం దగ్గరలోనే కేంద్రాలు ఏర్పాటు చేసి వడ్లు కొనడం మంచిగుంది. రవాణా ఖర్చు కూడా తగ్గింది. కొనుగోలు కేంద్రాల్లో అమ్మినప్పటి నుంచి వడ్ల డబ్బులు మా బ్యాంకు ఖాతాలోనే జమ చేస్తున్నారు. బయట వ్యాపారులకు అమ్మితే సమయానికి పైసలు రాకపోతుండే. ఇప్పుడు ఎలాంటి బాధ లేదు. గతంలో చాలా మోసపోయాం. కొనుగోలు కేంద్రాలను ఎప్పటికీ నడుపాలె.
భక్తు స్వామి, రైతు, గంగన్నపేట్