భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ) : పలు సమస్యలపై బాధితులు సమర్పించిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, వాటిని పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని భద్రాద్రి అదనపు కలెక్టర్ వేణుగోపాల్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీవోసీ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో వినతులు స్వీకరించిన ఆయన వాటి పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు.
టేకులపల్లి మండలం పానుగోతుతండాకు చెందిన భూక్యా మంగి తనకు ఇల్లు మంజూరు చేయాలని, మణుగూరు విఠల్ నగర్‌కు చెందిన రావుల కుమారస్వామి దివ్యాంగుడినైన తనకు రావాల్సిన ఉద్యోగాన్ని వెంటనే ఇప్పించాలని, బొల్లోరిగూడెం న్యూ పాల్వంచకు చెందిన బొల్లి రవి తనకు గృహజ్యోతి పథకం కింద జీరో బిల్లు అందడం లేదని, తనకు న్యాయం చేయాలని కోరారు. అలాగే బూర్గంపాడుకు చెందిన గోనెల బ్రహ్మం తనకు పాస్‌బుక్ ఇప్పించాలని అర్జీ సమర్పించారు. ప్రజావాణిలో జిల్లాలోని అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.