కారేపల్లి, నవంబర్ 29: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని అదనపు కలెక్టర్ శ్రీజ సూచించారు. విద్యార్థులకు రుచికరంగా తయారు చేసి ఇవ్వాలని ఆదేశించారు. కారేపల్లి మండలంలో శుక్రవారం పర్యటించిన ఆమె.. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను పరిశీలించారు. పాఠశాలలో తయారుచేసిన మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు.
ముందుగా వంట చేసే విధానాన్ని పరిశీలించారు. తరువాత విద్యార్థులతో కలిసి ఆమె కూడా భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భోజనం తయారీలో నాణ్యతను, శుభ్రతను పాటించాలని నిర్వాహకులను ఆదేశించారు. అంతకుముందు స్థానిక ఐకేపీ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కూడా ఆమె పరిశీలించారు. ఎంఈవో జయరాజు, ఏపీఎం పిడమర్తి వెంకన్న, ప్రధానోపాధ్యాయుడు శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
కొణిజర్ల, నవంబర్ 29: మండలంలోని పెద్దమునగాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఎంపీడీవో రోజారాణి శుక్రవారం పరిశీలించారు. పేరెంట్స్ మీటింగ్లో మాట్లాడారు.
రఘునాథపాలెం, నవంబర్ 29: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని మెనూ ప్రకారం అందించాలని ఖమ్మం అర్బన్ ఎంఈవో శైలజాలక్ష్మి మధ్యాహ్న భోజన ఏజెన్సీలను ఆదేశించారు. శుక్రవారం తన కార్యాలయంలో ఏజెన్సీల నిర్వాహకులతో సమావేశమై మిడ్ డే మీల్స్ ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.