మామిళ్లగూడెం, అక్టోబర్ 14 : ప్రజావాణిలో బాధితులు సమర్పించిన వినతుల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలని ఖమ్మం అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రజావాణి సందర్భంగా సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. టేకులపల్లి ప్రాంతానికి చెందిన శారద, ఖమ్మం నగరానికి చెందిన పి.దేవకరుణ, సత్తుపల్లి మండలం కాకర్లపల్లికి చెందిన జొన్నలగడ్డ రాములు తమ తమ సమస్యలపై దరఖాస్తులు సమర్పించారు. అనంతరం పెండింగ్ ప్రజావాణి దరఖాస్తులు, బయోమెట్రిక్ హాజరు, పాలనాపరమైన అంశాలపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ శ్రీజ మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులలో శాఖల వారీగా పెండింగ్ ఉన్న వాటిని వెంటనే పరిష్కరించాలని, డివిజన్ స్థాయి వాటిని డివిజన్లకు, మండల స్థాయి వాటిని మండలాలకు పంపించాలని సూచించారు. మండల ప్రత్యేకాధికారులు పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో పని చేస్తున్న అధికారులు, సిబ్బంది బయోమెట్రిక్ హాజరు తక్కువగా ఉన్నదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి శాఖ అధికారి వారి పరిధిలోని సిబ్బంది హాజరును రోజువారీగా పర్యవేక్షించాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో దీక్షా రైనా, డీఆర్డీవో సన్యాసయ్య, డీఆర్వో రాజేశ్వరి, కలెక్టరేట్ ఏవో అరుణ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.