ఖమ్మం/మామిళ్లగూడెం, నవంబర్ 2 : జిల్లాలో ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లాలోని తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంఈవోలు, సంబంధిత అధికారులతో ఇంటింటి సర్వే సన్నద్ధతపై, ధాన్యం, పత్తి కొనుగోళ్లపై వీసీ ద్వారా ఆమె సమీక్షించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్వే కోసం ప్రాథమిక పాఠశాల టీచర్లను ఎన్యూమరేటర్లుగా వినియోగించాలని, ప్రాథమిక పాఠశాలలు ఉదయం పూట మాత్రమే పని చేయాలని, మధ్యాహ్నం నుంచి టీచర్లు ఎన్యూమరేషన్లో పాల్గొనేలా చూడాలన్నారు. అలాగే జిల్లాలోని సరిహద్దు మండలాల పరిధిలో చెక్ పోస్టుల వద్ద అధికారులకు డ్యూటీలు వేయాలన్నారు. 5 మండలాల పరిధిలోని 9 పత్తి కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్లు సందర్శించి నివేదిక అందించాలని ఆదేశించారు.
జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో తెరవాలన్నారు. ఇందుకోసం జిల్లా మారెటింగ్ అధికారితో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్లు, ఎన్యూమరేషన్లో ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఉంటే 1077 టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని, దీనిపై విస్తృతంగా ప్రచారం కల్పించాలని అదనపు కలెక్టర్ సూచించారు. వీసీలో ట్రైనీ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, సీపీవో ఏ.శ్రీనివాస్, డీఈవో సోమశేఖర శర్మ, డీఆర్వో రాజేశ్వరి, ఆర్డీవోలు, డీపీవో రాంబాబు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.