ఖమ్మం వ్యవసాయం, ఆగస్టు 28 : ప్రభుత్వ ఆదేశాల మేరకు రుణమాఫీ ప్రక్రియకు సంబంధించి జిల్లావ్యాప్తంగా కుటుంబ నిర్ధారణ సర్వే బుధవారం ప్రారంభమైంది. 21 మంది మండల వ్యవసాయాధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు గ్రామాల్లో పర్యటించి వివరాలు సేకరించగా.. వీరికి సహాయకులుగా 129 క్లస్టర్లకు చెందిన వ్యవసాయ విస్తర్ణాధికారులు పని చేశారు.
సర్వే ప్రక్రియను వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు పర్యవేక్షించారు. జిల్లాలో రేషన్ కార్డు సమస్య కలిగిన రైతులు 49,179 మంది ఉండగా.. అందులో తొలిరోజు 1,442 కుటుంబాలకు చెందిన వివరాలను అధికారులు సేకరించారు. సర్వేను వారం రోజులపాటు నిర్వహించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. తొలిరోజు గ్రామాలకు వెళ్లిన ప్రత్యేక బృందాల అధికారులకు మిశ్రమ స్పందన కనిపించింది.
కొన్ని కుటుంబాలు సంతోషం వ్యక్తం చేయగా.. రుణమాఫీకి దూరమైన మరికొన్ని కుటుంబాలు అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించాయి. రుణమాఫీ వర్తింపజేసేందుకు పొరపాట్లను సరిదిద్దాలని అధికారుల ఎదుట వాపోయారు. కొద్ది రోజుల్లోనే సాంకేతిక సమస్యలను సరిచేస్తామని అధికారులు రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.