జూలూరుపాడు, జనవరి 5 : అడవులు, వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు డీఏఫ్‌వో జీ.కిష్టగౌడ్ పేర్కొన్నారు. జూలూరుపాడు రేంజ్ పరిధిలోని గుండెపుడి సెక్షన్, నల్లబండబోడు బీట్‌లోని కనకగిరి రిజర్వ్ ఫారెస్ట్‌ను శుక్రవారం ఎఫ్‌డీవో కోటేశ్వరరావుతో కలిసి ఆయన సందర్శించారు. అటవీ ప్రాంతంలో కలియతిరుగుతూ చెట్లు, మొక్కలను పరిశీలించారు. అడవి జంతువుల కోసం ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంక్‌లు, చెక్‌డ్యాంలను పరిశీలించారు.
జంతువుల సంరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని, వేటగాళ్లను అడవిలోకి ప్రవేశించకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉన్న గ్రామాల్లో సదస్సులు నిర్వహించి.. అడవుల ప్రాముఖ్యత గురించి వివరించాలన్నారు. అడవి జంతువుల వేట నేరమనే అంశంపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. వీరి వెంట ఎఫ్ఆర్వో జీ.ప్రసాదరావు, అటవీ శాఖ సిబ్బంది కే.లక్ష్మీనర్సు, కిషన్, ధనలక్ష్మి, కిషన్, రవి, రహీం, వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.