ఇంకా మిగిలింది 57 రోజులే..
వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు విద్యాశాఖ ప్రణాళిక
విద్యార్థులకు ప్రత్యేక తరగతులు
సాయంత్రం అల్పాహారం అందజేత
కొత్తగూడెం ఎడ్యుకేషన్, మార్చి 14: కొవిడ్ కారణంగా రెండు సంవత్సరాలుగా విద్యార్థులు ప్రత్యక్ష పరీక్షలకు దూరమయ్యారు. పరీక్షలు రాసే అవసరం లేకుండానే ప్రభుత్వం అందర్నీ పాస్ చేసింది. ఈ ఏడాది పరిస్థితులు బాగుండడంతో ప్రత్యక్ష తరగతులను ప్రారంభించింది. మరో 57 రోజుల్లో పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్నది. విద్యార్థులకు వెసులుబాటు కల్పించేందుకు కేవలం ఆరు పేపర్లతో మాత్రమే పరీక్షలు నిర్వహించనున్నది. ప్రశ్నాపత్రాల్లో 50 శాతం చాయిస్ ఉండేలా ప్రశ్నల రూపకల్పన జరుగనున్నది. మొత్తం సిలబస్లో కేవలం 70 శాతాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోనున్నది. పరీక్షలు మే 11న ప్రారంభం కానుండడంతో జిల్లా విద్యాశాఖ అధికారులు పక్కా ప్రణాళిక సిద్ధం చేశారు. జిల్లావ్యాప్తంగా ఈ సారి 13,419 మంది విద్యార్థులు పది పరీక్షలు రాయనున్నారు. అందుకు గాను విద్యాశాఖ అధికారులు 75 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వీటిలో 12 సి- సెంటర్లు ఉన్నాయి.
తల్లిదండ్రుల సహకారం అవసరం..
రెండేళ్లుగా కొవిడ్ కారణంగా విద్యార్థులు ప్రత్యక్ష తరగతులకు దూరమయ్యారు. ఈ ఏడాది ప్రభుత్వం పరీక్షలు నిర్వహించనున్నది. విద్యార్థులు కొద్దిగా ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. ఒత్తిడిని అధిగమించేందుకు తల్లిదండ్రులు సహకరించాలి. ప్రతిరోజూ పిల్లలను బడికి పంపాలి. సెల్ఫోన్లు, టీవీలకు దూరంగా ఉంచాలి. మంచి పౌష్టికాహారం అందించాలి. తల్లిదండ్రుల ప్రోత్సాహం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
విద్యార్థులకు అల్పాహారం..
పదోతరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు జిల్లా విద్యాశాఖ ప్రతిరోజూ అల్పాహారం అందించేలా ఏర్పాట్లు చేస్తున్నది. కలెక్టర్ అనుదీప్ నుంచి అనుమతులు రాగానే ప్రతిరోజూ విద్యార్థులకు గుగ్గిళ్లు, బిస్కెట్ ప్యాకెట్లు, అరటిపళ్లు అల్పాహారం అందించనున్నారు. అల్పాహారం అందిస్తామని దాతలెవరైనా ముందుకు వస్తే వారి సహకారం తీసుకోవచ్చని యాజమాన్యాలకు విద్యాశాఖ సూచించింది.
ఇంకా మిగిలింది 57 రోజులే…
పదోతరగతి పరీక్షలకు ఇంకా 57 రోజులే మిగిలి ఉన్నాయి. దీంతో విద్యాశాఖ ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసింది. ఇప్పటికే కలెక్టర్ అనుదీప్ పదోతరగతి పరీక్షల సన్నద్ధంపై ప్రధానోపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రతిరోజు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని వారిని ఆదేశించారు. పరీక్షలు పూర్తయ్యే వరకు విద్యార్థులు, ఉపాధ్యాయులు వందశాతం హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితి అయితే తప్ప సెలవు తీసుకోవద్దన్నారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండి ఉపాధ్యాయుల కొరత ఉంటే ఈ 57 రోజులకు పని సర్దుబాటులో భాగంగా ఇతర పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయుల సహకారం తీసుకోవాలన్నారు. జిల్లాలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు.
వందశాతం ఉత్తీర్ణత సాధిస్తాం..
పదోతరగతి పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించాం. ఈ ఏడాది వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేస్తున్నాం. పర్యవేక్షణ అధికారులను ప్రత్యేకంగా నియమించాం. ప్రతి పాఠశాలను సందర్శించే విధంగా చర్యలు చేపడుతున్నాం. ఇప్పటికే కలెక్టర్ ప్రత్యేక సమీక్ష నిర్వహించి ప్రధానోపాధ్యాయులకు దిశానిర్దేశం చేశాం. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఉత్తమ ఫలితాలు రాబడతాం. ఉపాధ్యాయులు బాధ్యత తీసుకునేలా చర్యలు తీసుకుంటాం.
– సోమశేఖరశర్మ, డీఈవో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా