ఖమ్మం వ్యవసాయం, అక్టోబర్ 24: అనేక షరతులు, నిబంధనల తరువాత వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులు (ఏఈవోలు) ఎట్టకేలకు డిజిటల్ క్రాప్ సర్వే (డీసీఎస్)కు అంగీకరించారు. ఏఈవోల సంఘం బాధ్యులు, అడ్‌హక్ కమిటీ సభ్యులు కలిసి రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్‌తో బుధవారం చర్చలు జరిపిన విషయం విదితమే. ఏఈవోల నాలుగు ప్రధాన డిమాండ్లను ఆ శాఖ సంచాలకుడు అంగీకరించడంతో తిరిగి డిజిటల్ క్రాప్ సర్వేను మూడు రోజులపాటు చేపట్టాలని ఏఈవోల సంఘం నేతలు నిర్ణయించారు. సస్పెండెడ్ ఏఈవోలను తక్షణమే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, ఈ నెల వేతనాలు యథావిధిగా జమ చేయాలని, మూడు రోజుల సర్వే అనంతరం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్‌రావులు అడ్‌హక్ కమిటీతో చర్చలు జరపాలని, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ల నియామకం గురించి ప్రభుత్వంతో చర్చించాలని ఏఈవోల సంఘం నేతలు డిమాండ్లు పెట్టారు. ఈ నాలుగు ప్రధాన డిమాండ్లకు రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు అంగీకరించారు. దీంతో ఎట్టకేలకు ఏఈవోలు డీసీఎస్ యాప్‌ను తమ సెల్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకున్నారు. శనివారం వరకు సర్వే కొనసాగించిన తరువాత మరోసారి చర్చలకు వెళ్లాల్సి ఉంటుందని వారు తెలిపారు. ఇది సమ్మె విరమణ కాదని, తాత్కాలిక వాయిదా మాత్రమేనని స్పష్టం చేశారు. సోమవారం చర్చల అనంతరం మరోసారి తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు.