రఘునాథపాలెం, డిసెంబర్ 26 : అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారుల దాడి జిల్లా ప్రాంతీయ రవాణాశాఖ అధికారులను సెట్‌రైట్ చేసింది. ఇది ఎంతకాలమో తెలియదు కానీ దాడుల మరుసటిరోజు నుంచి ఏజెంట్లు అడ్రస్ లేకుండాపోయారు. ఏసీబీ దాడి తర్వాత ఏజెంటు పేరెత్తితేనే అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తినంత పని అవుతున్నది. ‘ఏసీబీ’ ఎఫెక్ట్‌తో గత నాలుగు రోజులుగా రవాణాశాఖ కార్యాలయం ఎదుట ఉన్న దళారుల కార్యాలయాల్లో ఏ ఒక్కటీ తెరుచుకోలేదంటే చెప్పుకోదగిన విషయం. నేరుగా ఏసీబీ డీఎస్పీ సైతం దాడుల్లో పాల్గొనడంతో ఎవరికి వేటు పడనుందోనని రవాణాశాఖ అధికారులు బిక్కుబిక్కు మంటున్నారు.
కిందిస్థాయి సిబ్బందిని మొదలుకొని ఉన్నతస్థాయి అధికారి వరకు దాడులపైనే చర్చించుకుంటున్న సన్నివేశాలు కన్పించాయి. బాధ్యతాయుత హోదాలో ఉండి అవినీతికి ఆజ్యం పోస్తూ ఏజెంట్ల వ్యవస్థను పెంచి పోషిస్తున్న అధికారులకు చెక్ పెట్టే ఆలోచనలో ఏసీబీ అధికారులు ఉన్నట్లు తెలియవస్తోంది. ముఖ్యంగా కార్యాలయానికి వచ్చే ఫైళ్లపై ఉండే ఏజెంట్ ‘కోడ్’కు చెక్ పెట్టేందుకే ఈ దఫా ఏసీబీ అధికారులు దాడులు చేపట్టినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఏనాడూ ఏజెంట్ల కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టని ‘ఏసీబీ’ మొట్టమొదటగా దాడుల్లో దళారులపైనే కన్నేసింది. అంతేకాదు పక్కా ప్లాన్ ప్రకారం పాగా వేసి ఛేదించి ఏజెంట్లపై కేసులు సైతం నమోదు చేసింది.
అయితే అవినీతి నిరోధకశాఖ జరిపిన దాడుల సమయంలో ఏజెంట్ల వ్యవస్థకు ఊతమందిస్తున్న ఓ అధికారి సెలవుల్లో ఉండటం గమనార్హం. దాడుల్లో భాగంగా అధికారులు ఏజెంట్ల ద్వారానే లావాదేవీలు అధికంగా జరుగుతున్నట్లు గుర్తించినట్లు తెలిసింది. ఇందులో భాగంగానే వ్యవస్థను పోషించే అధికారులపై వేటు వేసేందుకు కార్యాలయం సీసీ ఫుటేజ్‌లను పరిశీలించేందుకు ఏసీబీ సేకరించింది. అయితే ఏసీబీ దాడులు వాహనదారులను సంతోషంతో నింపాయి. ఏజెంటు ఉంటేనే పనిచేసే అధికారులు గత నాలుగురోజులుగా ఎటువంటి ఇబ్బందులకు గురిచేయకుండా పని చేసి పంపించారు. వాహనదారులు ఎంచక్కా నిబంధనల మేరకు క్యాష్ చెల్లించి పనులు చేయించుకొని సంతోషంతో ఇంటిబాట పడుతున్నారు. ఈ ప్రక్రియ నిరంతరం ఇలానే కొనసాగితే బాగుంటుందనే అభిప్రాయాన్ని వాహనదారులు వ్యక్తం చేశారు.