భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : పండ్ల తోటల పెంపకానికి డ్రిప్ పరికరాలను సరఫరా చేసే వ్యక్తి నుంచి రూ.1.14 లక్షలు లంచం తీసుకుంటుండగా జిల్లా ఉద్యానవన అధికారిని ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలో పండ్ల తోటల పెంపకానికి ప్రభుత్వం ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో రైతులకు సబ్సిడీపై డ్రిప్ పరికరాలను అందజేస్తోంది.
అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతోపాటు మహబూబాబాద్ జిల్లాకు కూడా డ్రిప్ పరికరాలను సరఫరా చేసి.. రైతుల తోటల్లో బిగించిన వ్యక్తికి జిల్లా ఉద్యానవన శాఖ కార్యాలయం నుంచి బిల్లులు రావాల్సి ఉంది. దీనిని అదునుగా భావించిన జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమల శాఖ అధికారి కె.సూర్యనారాయణ.. తనకు పర్సంటేజీ ఇస్తేనే బిల్లులు చేస్తానని సదరు వ్యక్తికి చెప్పాడు. దీంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించిన బాధిత వ్యక్తి.. పరిస్థితిని వారికి వివరించాడు.
ఏసీబీ అధికారులు చెప్పిన విధంగా బాధితుడు భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ భవన సముదాయంలో ఉన్న జిల్లా ఉద్యానవన అధికారి సూర్యనారాయణకు రూ.1.14 లక్షల లంచం ఇచ్చాడు. సాయంత్రం 6:45 గంటలకు అక్కడ మాటువేసి ఉన్న ఏసీబీ డీఎస్పీ రమేశ్ తన బృందంతో సూర్యనారాయణ వద్ద ఉన్న లంచం డబ్బులను గుర్తించి పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. దాడుల్లో ఏసీబీ ఇన్స్పెక్టర్లు శేఖర్, రామారావు, సిబ్బంది పాల్గొన్నారు.