కొత్తగూడెం ఎడ్యుకేషన్, అక్టోబర్ 29: పెండింగ్ బిల్లులు చేసేందుకు ఓ ఏజెన్సీ నిర్వాహకుడి నుంచి రూ.3 లక్షలు లంచం తీసుకుంటూ అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలలో మంగళవారం చోటు చేసుకుంది. ఏసీబీ డీఎస్పీ రమేశ్ కథనం ప్రకారం.. కొత్తగూడెంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఓ ఏజెన్సీ ద్వారా 49 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు.
తొమ్మిది నెలలకు సంబంధించి వారి వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని చెల్లించేందుకు మెడికల్ కళాశాల అకౌంట్స్ ఆఫీసర్ ఖలీలుల్లా, జూనియర్ అసిసెట్ సుధాకర్ సదరు ఏజెన్సీ నిర్వాహకుడి నుంచి రూ.7 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో మొదటి విడతగా రూ.3 లక్షలు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్న ఏజెన్సీ నిర్వాహకుడు అనంతరం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారు పన్నిన పథకం ప్రకారం ఏవో, జూనియర్ అసిస్టెంట్‌కు మంగళవారం రూ.3 లక్షలు లంచం ఇస్తుండగా.. అక్కడే మాటు వేసిన ఏసీబీ అధికారులు వలపన్ని వారిని పట్టుకున్నారు. కేసు నమోదు చేసిన అధికారులు ఏవో, జూనియర్ అసిస్టెంట్‌ను ఏసీబీ కోర్టుకు తరలించారు.