భద్రాచలం, ఏప్రిల్ 10: గ్రావెల్ తరలిస్తున్న లారీని విడిచిపెట్టేందుకు లంచం డిమాండ్ చేసిన సీఐ, గన్‌మెన్, ఓ ప్రైవేటు వ్యక్తిని ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఈ ఘటన భద్రాచలం పట్టణంలో గురువారం చోటు చేసుకుంది. ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల 19న బూర్గంపాడు లక్ష్మీపురానికి చెందిన ఓ లారీలో గ్రావెల్ తరలిస్తుండగా భద్రాచలంలో పోలీసులు పట్టుకొని స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో కేసు లేకుండా లారీని విడిచిపెట్టేందుకు యజమాని నుంచి సీఐ గన్‌మెన్ రామారావు రూ.30 వేలు డిమాండ్ చేశారు.
దీంతో సదరు యజమాని తన వద్ద డబ్బులు లేవు అని చెప్పినా.. రూ.20 వేలు ఇచ్చినా సీఐతో చెప్పి లారీని వదిలిపెడతామని పేర్కొన్నారు. చేసేది లేక లారీ యజమాని రూ.20 వేలు సమకూర్చుకుని గన్‌మెన్ రామారావుకు చెప్పాడు. ఆ డబ్బులు నాకు ఇవ్వొద్దు అని చెప్పి.. సారపాకకు చెందిన కార్తీక్ అనే వ్యక్తికి పోలీస్‌స్టేషన్ ఆవరణలోనే ఫోన్ పే చేయించారు. అనంతరం పోలీసులు లారీని విడిచిపెట్టారు. తర్వాత లారీ యజమాని ఏసీబీ అధికారులకు జరిగిన విషయాన్ని వివరించారు.
దీంతో గురువారం భద్రాచలం పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న ఏసీబీ అధికారులు తొలుత సారపాకలో కార్తీక్‌ను అదుపులోకి తీసుకున్నారు. మళ్లీ భద్రాచలం పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని గన్‌మెన్ రామారావును, సీఐ బరపటి రమేశ్‌ను అదుపులోకి తీసుకొని ముగ్గురిని కలిపి విచారించారు. సీఐ సూచన మేరకే తాను లారీపై కేసు లేకుండా చేసేందుకు డబ్బులు డిమాండ్ చేసినట్లు రామారావు అంగీకరించాడు. అలాగే ఫోన్ పే చేసిన వీడియో సైతం రికార్డు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ రమేశ్ వివరించారు. ముగ్గురిని అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్లు పేర్కొన్నారు.
గన్‌మెన్ చేసిన తప్పుకు కేసులో తనను ఇరికించి అన్యాయం చేశారని భద్రాచలం సీఐ రమేశ్ విలేకరుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. గన్‌మెన్ రామారావు తీసుకున్న డబ్బుల విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని, తననెందుకు లాగుతున్నారో అర్థం కావడం లేదని ఏసీబీ డీఎస్పీతో భదాద్రాచలం సీఐ వాగ్వాదానికి దిగారు.
ఏడాది వ్యవధిలోనే రెండుసార్లు భద్రాచలం పోలీస్‌స్టేషన్‌పై ఏసీబీ అధికారులు దాడులు చేయడం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గత ఏడాది ఏప్రిల్ 18న ఇదే పోలీస్‌స్టేషన్‌లో అప్పటి ఎస్సై ములగొండ శ్రీనివాస్, కానిస్టేబుల్ శంకర్‌శెట్టి శంకర్‌తోపాటు మరో సీసీ కెమెరా టెక్నీషియన్ ఓ దొంగతనం కేసులో రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డారు.