అశ్వారావుపేట, మే 28 : అశ్వారావుపేట మండలంలోని అంతర్ రాష్ట్ర సరిహద్దు రవాణా చెక్‌పోస్ట్‌పై ఏసీబీ అధికారులు మంగళవారం దాడి చేశారు. ఈ దాడిలో రూ.35 వేల నగదును స్వాధీనం చేసుకుని ఏడుగురు ప్రైవేట్ వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అక్కడ విధుల్లో ఉన్న ఎంవీఐపై కేసు నమోదు చేశారు. ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. లారీడ్రైవర్లు, యజమానుల ఫిర్యాదు మేరకు ఉన్నతాధికారుల ఆదేశానుసారం డీఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం దాడి చేసింది. వాహనదారుల నుంచి వసూలు చేసిన రూ.35 వేలను స్వాధీనం చేసుకున్నారు. లారీడ్రైవర్ల నుంచి వివరాలు సేకరించారు. డీఎస్పీ రమేశ్ విలేకరులతో మాట్లాడుతూ లారీలకు అనుమతులు ఉన్నప్పటికీ ఒక్కో వాహనం నుంచి రూ.200 నుంచి రూ.800 వరకు వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలిపారు. విధుల్లో ఉన్న ఎంవీఐ జనార్దన్‌రెడ్డితోపాటు ఏడుగురు ప్రైవేట్ వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన వెంట ఏసీబీ సీఐలు సునిల్, శేఖర్, హెడ్ కానిస్టేబుల్ పుల్లయ్య, సిబ్బంది ఉన్నారు. ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని ప్రజలను కోరారు. చట్టబద్దంగా చేయాల్సిన ఏ పని కోసమైనా లంచం అడిగితే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064 సంప్రదించాలని సూచించారు.
అశ్వారావుపేట నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ అధికారుల్లో ఏసీబీ దాడులు దడ పుట్టిస్తున్నాయి. ఈ నెల 16వ తేదీన ఒక రైతు నుంచి రూ.లక్ష లంచం తీసుకుంటుండగా డిస్కం ఏఈ శరత్‌ను ఏసీబీ డీఎస్పీ రమేశ్ నేతృత్వంలో బృందం ట్రాప్ చేసి పట్టుకుంది. పక్షంరోజుల వ్యవధిలోనే అంతర్ రాష్ట్ర సరిహద్దు రవాణా చెక్‌పోస్ట్‌పై దాడులు చేశారు. దీంతో ఎప్పుడు ఏ శాఖపై దాడి జరుగుతుందోననే అధికారులు భయంభయంగా ఉన్నారు.