 
                                                            ఖమ్మం అర్బన్, అక్టోబర్ 29 : జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో వివిధ పోస్టులలో నియమించబడిన ఉపాధ్యాయుల అదనపు డిప్యూటేషన్‌ను రద్దు చేస్తూ డీఈవో డాక్టర్ శ్రీజ బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ‘గాడి తప్పిన పాలన’, ‘సమీక్షలతో సరి! ఆచరణ ఏదీ?’, ‘ సెక్టోరల్కు డిప్యూటేషన్‌పై మరో టీచర్’ శీర్షికలతో ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ఇటీవల వరుస కథనాలు ప్రచురితమైన విషయం విదితమే. దీనిపై డీఈవోగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ వెంటనే స్పందించారు. ఏఎంవో, సీఎంవో, ఓపెన్ స్కూల్ తదితర విభాగాల్లో పనిభారం అదనంగా ఉందనే సాకు చెబుతూ కొందరు ఉపాధ్యాయులను డిప్యూటేషన్‌పై ఆయా విభాగాల్లో నియమించారు.
తాజాగా సీఎంవో, ఏఎంవోగా నియమించబడిన వారు తమకు పనిభారం ఎక్కువగా ఉన్నదని, ఇందుకోసం సహాయకులు కావాలని ఉన్నతాధికారులను కోరడంతో డీఈవో దీనిపై సానుకూలంగా స్పందించారు. అయితే అలాంటి పోస్టులేవీ అధికారికంగా లేవని, కొన్నేళ్లుగా ఎవరూ ఆయా పోస్టుల్లో నియామకం కాలేదన్న విషయాన్ని డీఈవో దృష్టికి తీసుకెళ్లక పోవడంతో వీరి నియామకం జరిగినట్లు తెలుస్తుంది. నిబంధనల పట్ల ముక్కుసూటిగా వ్యవహరించే నిబద్ధత కలిగిన అదనపు కలెక్టర్ శ్రీజ తనకు సరైన సమాచారం సకాలంలో ఇవ్వకపోవడంపై సంబంధిత సిబ్బందిపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
దీంతో గత డీఈవో హయాంలో నియమించిన ఎం.శ్రీనివాసరావుతో సహా తాజాగా సస్పెండ్ అయిన లక్ష్మణ్‌రావుతోపాటు వయోజన విద్య విభాగానికి నియమించిన శశిధర్, అసిస్టెంట్ సీఎంవోగా నియమించిన సాగర్, అసిస్టెంట్ ఏఎంవోగా నియమించబడిన విజయ్‌కుమార్‌ల డిప్యూటేషన్లను తక్షణమే రద్దు చేస్తూ డీఈవో శ్రీజ ఉత్తర్వులు జారీ చేశారు. ఉపాధ్యాయులను ప్రభుత్వం నిర్దేశించిన పోస్టుల్లో మినహా మరెక్కడా నియమించొద్దనే అంశంపై గతంలో న్యాయపరమైన ఉత్తర్వులతోపాటు ప్రభుత్వ నిబంధనలు సైతం స్పష్టం చేస్తున్నాయి. దీంతో వారి డిప్యూటేషన్లను రద్దు చేయడంతో ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
 
                            