చర్ల, జూలై 6 : 70 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న పాఠశాల అది. ఎందరో ప్రముఖులకు బాల్యంలో ప్రాథమిక విద్యను అందించిన ప్రైమరీ స్కూలు అది. గడిచిన కొన్నేళ్ల వరకూ నిండా విద్యార్థులతో కళకళలాడిన సరస్వతీ నిలయమది. కానీ.. క్రమంగా కునారిల్లుతో వస్తోంది. ప్రస్తుతం ప్రాభవం కోల్పోయే పరిస్థితి చేరుకుంది. అదే.. చర్ల మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల. ఒకటి నుంచి ఐదు తరగతుల వరకూ ఉన్న ఈ పాఠశాలకు 70 ఏళ్ల చరిత్ర ఉంది. ఇన్నాళ్లుగా వేలాదిమంది చిన్నారులకు ప్రాథమిక విద్యనందించింది.
ఏటా వందల సంఖ్యలో విద్యార్థులతో చదువుల నిలయంగా భాసిల్లుతుండేది. ఇక్కడ ప్రాథమిక విద్యను అభ్యసించిన విద్యార్థుల్లో ఎంతోమంది.. తరువాత ఉన్నత చదువులు పూర్తి చేసుకొని ఉన్నత స్థానాల్లోనూ స్థిరపడ్డారు. ఇంతటి ఘనకీర్తి కలిగిన ఈ పాఠశాల ఇప్పుడు కనీసం ఆదరణకు కూడా నోచుకోలేకపోతోంది. గతంలోనే ఈ పాఠశాలకు రెండు భవనాలు ఉండేవి. వాటిల్లో ఒకటి శిథిలావస్థకు చేరుకోవడంతో విద్యార్థులు కొంత భయంభయంగానే తరగతుల్లో కూర్చుకున్నారు. ఇటీవల విద్యాశాఖ కొత్త భవన నిర్మాణాన్ని చేపట్టింది. పాత భవనం శిథిలావస్థలో ఉండడంతో కొత్త భవనం పూర్తికాకముందే అందులో తరగతుల బోధన జరుగుతోంది.
అయితే, గడిచిన మూడేళ్లుగా ఈ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. ఒకటి నుంచి ఐదు తరగతులకు కలిపి 20 మందిలోపే విద్యార్థులున్నారు. వారందరికీ కలిపి ఒక్కరే ఉపాధ్యాయురాలు. ఇక పాఠశాల ఆవరణలో వర్షపు నీరు నిలుస్తోంది. చివరికి ఇనుముతో తయారు చేసిన పాఠశాల నేమ్ బోర్డు కూడా మూలకు ఒరిగి పక్కకు పడిపోయింది.
రెసిడెన్షియల్, మోడల్ స్కూళ్ల ప్రభావం ఉంది..
ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నప్పటికీ చర్ల ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంది. అంగన్వాడీ కేంద్రాల నుంచి వచ్చే విద్యార్థుల సంఖ్య కూడా పెద్దగా లేదు. విద్యార్థుల తల్లిదండ్రులు ఇంకా మెరుగైన వసతులున్న పాఠశాలలవైపు మొగ్గు చూపుతున్నారు. ప్రధానంగా రెసిడెన్షియల్, మోడల్, కస్తూర్బా స్కూళ్ల ప్రభావం ఉంది. ప్రభుత్వ నిబంధనల మేరకు ఈ పాఠశాలకు అన్ని సౌకర్యాలూ కల్పిస్తున్నాం.
-ఝంకీలాల్, ఎంఈవో, చర్ల