Bhadradri Kothagudem | హైదరాబాద్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో విషాదం చోటు చేసుకుంది. సీతారామపట్నం వద్ద ఓ మున్సిపల్ కాంట్రాక్టర్ అనుమానాస్పదస్థితిలో మృతి చెంది ఉన్నాడు. అయితే ఆ కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడా..? లేక హత్యకు గురయ్యాడా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కొత్తగూడెం జిల్లాలోని గట్టయ్యగూడెం పరిధిలోని ఆదర్శ్ నగర్‌కు చెందిన జే సుధాకర్.. మాజీ ఆర్మీ జవాన్. ప్రస్తుతం మున్సిపల్ కాంట్రాక్టర్‌గా పని చేస్తున్నాడు. విద్యుత్ ఎంప్లాయిస్ కాలనీ వద్ద మార్నింగ్ వాకర్స్‌కు సుధాకర్ మృతదేహం కనిపించింది. దీంతో అప్రమత్తమైన మార్నింగ్ వాకర్స్ పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు డెడ్‌బాడీని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం గవర్నమెంట్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతదేహం వద్ద పెస్టిసైడ్ డబ్బా, కారు లభించాయి. అయితే సుధాకర్ మంగళవారం రాత్రి పని ఉందని చెప్పి.. ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. సుధాకర్ మృతి వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. సుధాకర్ మృతికి కచ్చితమైన కారణాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్య..? హత్యా..? అన్న కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.