కరకగూడెం, ఫిబ్రవరి 14: కరకగూడెం మండలంలోని అడవుల్లో పెద్దపులి సంచరిస్తున్నదని, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు. రాళ్లవాగు వద్ద గల పెద్దమ్మతల్లి ఆలయం వెనుక భాగంలో శనివారం పెద్దపులి పాదముద్రలు గుర్తించామని అటవీ క్షేత్రాధికారి (రేంజర్) తేజస్విని తెలిపారు. రెండు రోజులుగా కరకగూడెం అడవుల్లో సంచరిస్తున్నదని, ముందుగా రాయినిపేట అడవుల్లో పెద్దపులి జాడలు కనిపించాయని అన్నారు.
రాయినిపేట నుంచి రాళ్లవాగు మీదుగా కిన్నెరసాని వైల్డ్‌లైఫ్ రేగళ్ల అడవులకు వెళ్లినట్లుగా జాడలు గుర్తించామని తెలిపారు. రైతులు, పెంపకందారులు తమ పశువులను, జీవాలను మేత కోసం అటవీ ప్రాంతాలకు తీసుకువెళ్లవద్దని సూచించారు. అటవీ ప్రాంతాల్లో ఉచ్చులు, కరెంట్ తీగలు అమర్చితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా, పెద్దపులి సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

Khammam