ఎర్రుపాలెం, మార్చి 11 : రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్ల కోసం తప్ప ప్రజల కోసం పనిచేయడం లేదని, ప్రతీ పనికి 20 శాతం చొప్పున కమీషన్లు వసూలు చేయడమే పనిగా పెట్టుకున్నదని జడ్పీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ ఇన్చార్జి లింగాల కమల్‌రాజు ఆరోపించారు. ఇనగాలి గ్రామంలోని బాలరాఘవరెడ్డి నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సచివాలయంలో మధిర ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం చాంబర్ ముందు ఆయన అనుచరులు కాంట్రాక్టర్లను 20 శాతం చొప్పున కమీషన్లు అడుగుతున్నారని ఆరోపించారు. గతంలో మధిరను పరిపాలించిన శీలం సిద్ధారెడ్డి, దుగ్గినేని వెంకట్రామయ్య, వెంకట్రావమ్మ, బోడేపూడి వెంకటేశ్వరరావు, కొండబాల కోటేశ్వరరావు, కట్టా వెంకటనర్సయ్య మధిర కీర్తిని పెంచేలా ప్రజల కోసం పని చేశారని గుర్తు చేశారు. ఎర్రుపాలెం మండలంలో సాగర్ జలాలు అందక యాసంగి పంటలు ఎండిపోతున్నా పట్టించుకునేవారు కరువయ్యారన్నారు.
అన్ని వర్గాలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా పూర్తిగా ఇవ్వకపోగా.. ప్రశ్నిస్తున్న ప్రతిపక్షంపై ఎదురు దాడికి దిగడం ఎంతవరకు సబబు అని ఆయన ప్రశ్నించారు. ఇచ్చిన 420 హామీలు పూర్తిగా అటకెక్కించి, కమీషన్ల కోసం కక్కుర్తి పడుతూ పాలనను గాలికొదిలేసిందన్నారు. ఇప్పటివరకు ఉమ్మడి రాష్ట్రంలో ఎందరో ముఖ్యమంత్రులు పాలించారని, కానీ.. రేవంత్‌రెడ్డిపై ఇంత త్వరగా వచ్చిన వ్యతిరేకత ఇంకెవరిపై రాలేదన్నారు. అనంతరం ఇనగాలి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి కుమార్తె పెళ్లికి హాజరై వధువును ఆశీర్వదించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ శీలం కవిత, పార్టీ మండల కార్యదర్శి యన్నం శ్రీనివాసరెడ్డి, నాయకులు సంక్రాంతి కృష్ణారావు, వేమిరెడ్డి బాలరాఘవరెడ్డి, పుల్లారెడ్డి, సిద్ధారెడ్డి, కృష్ణారెడ్డి, తిరుపతిరావు, బొర్రా నరసింహారావు, నాగరాజు పాల్గొన్నారు.