ఖమ్మం, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): గురుకులాలపై అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్న ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం.. వాటిల్లోని విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోంది. ఓవైపు ఫుడ్ పాయిజన్లతో ప్రాణాలు కోల్పోతున్న గురుకులాల విద్యార్థుల సంఖ్య పెరుగుతుండగానే.. మరోవైపు ఎలుకలు కొరకడంతో ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్న విద్యార్థుల సంఖ్య వెలుగులోకి వస్తోంది. ఇలాంటి ఘటనలు బయటకు రాకుండా అధికారులు జాగ్రత్త పడుతున్నప్పటికీ ఇటీవల ఎలుకలు కొరికిన కారణంగా ఓ విద్యార్థిని ప్రాణాపాయ స్థితికి చేరిన ఘటన ఖమ్మంలో ఆలస్యంగా వెలుగుచూసింది. తన కుమార్తె ప్రాణాపాయ స్థితిని చూసి తట్టుకోలేని ఓ తల్లి అసలు విషయాన్ని మీడియా ముందుకు తెచ్చింది. గురుకుల అధికారుల నిర్లక్ష్యం కారణంగా మిగతా పిల్లలెవరికీ తన కుమార్తెలాంటి పరిస్థితి రాకూడదంటూ వేదనను వెలిబుచ్చింది.
ఖమ్మం ముస్తాఫానగర్‌కు చెందిన సముద్రాల లక్ష్మీ భవానీ కీర్తి రఘునాథపాలెం మండలం దానవాయిగూడెం బీసీ గురుకుల బాలికల సంక్షేమ వసతిగృహంలో పదో తరగతి చదువుతోంది. గత నెల (నవంబర్)లో హాస్టల్లో రాత్రివేళ నిద్రిస్తున్న సమయంలో ఎలుకలు కరవడంతో ఈ తీవ్రంగా గాయపడింది. మరునాడే ఈ విషయాన్ని హాస్టల్ బాధ్యులకు తెలియజేసింది. ఎలుకలు కొరికిన ఆనవాళ్లను గుర్తించిన నిర్వాహకులు.. విషయాన్ని గోప్యంగా ఉంచారు. విద్యార్థినిని రహస్యంగా తీసుకెళ్లి ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో రేబిస్ టీకా వేయించారు. వారం రోజుల క్రితం విద్యార్థిని కీర్తి.. తన తల్లికి ఫోన్ చేసింది. తన కాళ్లూ చేతులూ లాగుతున్నాయంటూ తెలియజేసింది. ఆందోళనకు గురైన తల్లి వెంటనే హాస్టల్‌కు చేరుకొని తక్షణమే నగరంలోని మమత ఆసుపత్రికి తీసుకెళ్లింది. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు.. ‘ఎలుకలు కొరకడం వల్ల నరాలు చచ్చుబడ్డాయి. అందుకే కాళ్లూ చేతులకు స్పర్శ ఉండడం లేదు.’ అని తేల్చారు. రెండు రోజులకు కీర్తి ఆరోగ్యం మరికొంత విషమించింది. వెంటనే విద్యార్థిని తల్లి.. ఈ విషయాన్ని హాస్టల్ నిర్వాహకులకు చెప్పింది. ‘ఎలుకలు కొరికిన వెంటనే రేబిస్ టీకా వేయించాం. ఇక మాకేమీ సంబంధం లేదు’ అంటూ చెప్పి వారు తప్పించుకున్నారు. కాగా, వారం రోజులుగా చికిత్స పొందుతున్న బాలిక ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది.
కాగా, ఖమ్మంలోని మమత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక కీర్తిని బీఆర్ఎస్ నేతలు మంగళవారం పరామర్శించారు. సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య.. సదరు బాలికతోనూ, ఆమె తల్లితోనూ మాట్లాడి ఘటన వివరాల గురించి తెలుసుకున్నారు. విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల వద్ద ఆరా తీశారు. అనంతరం ఆసుప్రతి వద్ద మీడియాతో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం.. నిరుపేదలు చదువుతున్న గురుకులాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఎలుకలు కరిచాయని తాను చెబితే హాస్టల్ అధికారులు 15 సార్లు వ్యాక్సిన్ వేయించారని విద్యార్థిని చెబుతోందని అన్నారు. అవి వికటించడం వల్లనే ఆమె ప్రాణాపాయ స్థితికి వచ్చినట్లు వైద్యులు చెబుతున్నారని అన్నారు. విద్యార్థినిని పరామర్శించిన వారిలో బీఆర్ఎస్ నేతలు బొమ్మెర రామ్మూర్తి, పగడాల నాగరాజు, ఉబ్బలపల్లి నిరోషా తదితరులు ఉన్నారు.
ఖమ్మం, డిసెంబర్ 17: ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఖమ్మం గురుకుల విద్యార్థిని కీర్తికి ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడిందని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆరోపించారు. ఎలుకలు కరవడంతో విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి విషమించి చికిత్స పొందుతున్న విషయాన్ని తెలుసుకున్న వద్దిరాజు.. మంగళవారం ఢిల్లీ నుంచి ఫోన్ చేసి బాలిక ఆరోగ్యం గురించి ఆరా తీశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి బాధితురాలికి మెరుగైన చికిత్స అందించాలని డిమాండ్ చేశారు.
ఖమ్మం ఎడ్యుకేషన్, డిసెంబర్ 17: దానవాయిగూడెం బీసీ బాలికల గురుకులంలో టెన్త్ విద్యార్థినిని ఎలుకలు కరిచిన విషయంపై కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ విచారణకు ఆదేశించారు. ఈ ఘటనపై మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఫిర్యాదు మేరకు కలెక్టర్ స్పందించారు. విచారణ చేసి పూర్తిస్థాయి నివేదికను అందజేయాలని జిల్లా ఉపాధి కల్పనాధికారి మాధవిని ఆదేశించారు. ఈ మేరకు స్వయంగా హాస్టల్‌ను సందర్శించిన జిల్లా ఉపాధి కల్పనాధికారి.. ఈ ఘటనపై ఆరా తీశారు. ప్రత్యేకంగా కొందరు విద్యార్థినులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఎలుకలు సంచరిస్తున్నాయని, తమలో కొందరిని కరిచాయని, టీకాలు తీసుకున్నామని పలువురు విద్యార్థినులు విచారణాధికారికి వివరించారు. అంతేగాక, శాఖాపరమైన నివేదికను అందజేయాలని ఖమ్మం జిల్లా ఆర్సీవో బ్యూలారాణి, డీసీవో జ్యోతిర్మయిలను బీసీ గురుకులాల సెక్రటరీ సైదయ్య ఆదేశించారు. ఈ మేరకు ఆర్సీవో కూడా తన నివేదికను అందజేశారు.