రఘునాథపాలెం, ఫిబ్రవరి 12 : కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం క్వింటా మిర్చికి రూ.వెయ్యి చొప్పున బోనస్ ఇవ్వాలని, మిర్చి క్వింటాకు రూ.35 వేలు మద్దతు ధర నిర్ణయించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కెచ్చల రంగయ్య, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్యలు డిమాండ్ చేశారు. వందలాది మంది రైతులతో కలిసి ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ను బుధవారం సందర్శించిన సంఘం రాష్ట్ర బృందం గేటు ఎదుట ఆందోళన నిర్వహించింది. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కెచ్చల రంగయ్య, ఉప్పల ప్రభాకర్ మాట్లాడుతూ ఆరుగాలం శ్రమించి పంట పండించి మార్కెట్లో విక్రయించేందుకు వస్తే ఖరీదుదారులు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు.
రైతులు మిర్చి అమ్ముకోగా వచ్చిన డబ్బులపై రూ.2 చట్టబద్దంగా చెల్లించాల్సి ఉండగా.. 4 నుంచి 7 శాతం తీసుకుంటున్నారని ఆరోపించారు. సరుకు ఖరీదు చేసిన ధరకు కాకుండా కాటా సమయంలో కొర్రీలు పెట్టి రూ.400 నుంచి రూ.700 వరకు ధర తగ్గిస్తున్నారని ఆరోపించారు. కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉంచుకునే రైతుల పంట ఉత్పత్తులకు రూ.5 లక్షల వడ్డీలేని రుణం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం మార్కెట్ చైర్మన్, కార్యదర్శులతో చర్చించి రైతుల సమస్యలను విన్నవించారు. సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మలీదు నాగేశ్వరరావు, ఆవుల వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకులు గుర్రం అచ్చయ్య, చండ్ర అరుణ, కోలేటి నాగేశ్వరరావు, పాశం అప్పారావు, కేలోతు లక్ష్మణ్, జిల్లా నాయకులు కుర్ర వెంకన్న, దరావత్ లక్ష్మణ్, గుగులోతు తేజ, వడ్డే వెంకటేశ్వర్లు, బందెల వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.