భద్రాద్రి కొత్తగూడెం, జూలై 26 (నమస్తే తెలంగాణ) : ఒక్కో వ్యాధికి ఒక్కో పేరు. ఇప్పటివరకు జనాలను పట్టిపీడిస్తున్న రోగాల్లో క్యాన్సర్ పెద్ద వ్యాధి అయినా మొదట్లో తెలుసుకుంటే కొంత వరకు బయటపడుతున్న సంఘటనలు చూస్తున్నాం. దీంతోపాటు డయాబెటిస్, బీపీ, థైరాయిడ్, మూత్రపిండాల వ్యాధులు చూస్తున్నాం. అంతేకాక మలేరియా, టైఫాయిడ్, డెంగీ వంటి జ్వరాలు వస్తున్నాయి. వీటన్నింటికన్నా పెద్ద వ్యాధి ఉందంటే అది ‘సికిల్ సెల్’ అని చెప్పుకోవచ్చు.
ఇది ప్రాణాంతకమా అంటే వ్యాధిని ముందుగా గుర్తిస్తే బతికే అవకాశాలు ఉన్నాయి. గుర్తించకపోతే రక్తహీనత సమస్యతో విపరీతమైన నొప్పి, తరచూ కామెర్లు, నీరసమైపోయి చివరికి చనిపోయే ప్రమాదమూ లేకపోలేదు. ఇది జనరల్‌గా జన్యుపరంగా వచ్చే వ్యాధి.. కానీ.. మేనరికం ద్వారా తలసేమియా లాంటి వ్యాధికి దగ్గరగా ఉండే వ్యాధి అనీ చెప్పవచ్చు.
ముఖ్యంగా ఇది గిరిజన కుటుంబాల్లో వస్తున్నట్లు గుర్తించిన నేషనల్ హెల్త్ మిషన్ 2023 జూన్‌లో వ్యాధి నిర్ధారణ చేయడానికి ముందుకొచ్చింది. తరచూ ఇలాంటి సమస్యలు రావడంతో ఆరోగ్యమిషన్ సికిల్ సెల్ వ్యాధి పరీక్షలు ప్రారంభించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇప్పటికే మూడు దఫాలుగా పరీక్షలను చేపట్టి వ్యాధిగ్రస్తులను గుర్తించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా మూడో దఫాలో భాగంగా ప్రత్యేక వైద్య శిబిరాలను గిరిజన ప్రాంతాల్లో ఏర్పాటు చేసింది.
ముందస్తుగా మేల్కొంటే తప్పే ముప్పు..
రక్తకణాల ద్వారా వచ్చే సమస్యనే సికిల్ సెల్ వ్యాధిగా వైద్యశాఖ నిర్ధారణ చేసి పరీక్షలు చేపడుతున్నది. గిరిజన ప్రాంతాల్లో కేవలం గిరిజనులకే వస్తుందా అంటే ఎక్కువ శాతం వచ్చే అవకాశాలు ఉంటాయని ఆ శాఖ చెప్పకనే చెబుతున్నది. ఒకే కుటుంబాలు అక్కడి వారినే పెళ్లి చేసుకోవడం వల్ల కూడా జన్యుమార్పిడి ఒకరి నుంచి ఒకరికి వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
దగ్గర సంబంధాలు చేసుకోవడం వల్ల, సికిల్ సెల్ క్యారియర్స్ ఉన్నవారు క్యారియర్ ఉన్నవారిని చేసుకుంటే వారికి పుట్టే పిల్లలకు వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. అందువల్ల ముందస్తుగా మేల్కొంటే తప్ప ఈ వ్యాధి తగ్గే అవకాశాలు లేవని తెలుసుకున్న ఆరోగ్యశాఖ వ్యాధిని నిరోధించడానికి సికిల్ సెల్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే గిరిజన ప్రాంతాల్లో జీరో నుంచి 40 సంవత్సరాల వయస్సు ఉన్నవారిని గుర్తించి పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటికీ మూడు దఫాలుగా అన్ని ప్రాంతాల్లో వైద్య పరీక్షలు చేశారు.
గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక పరీక్షలు
సికిల్ సెల్ వ్యాధి నిర్ధారణ కోసం జిల్లాలో జీరో టు నలభై సంవత్సరాల వయస్సు ఉన్న 2,61,615 మందికి పరీక్షలు చేశారు. ఇందులో 84 మందికి వ్యాధి ఉన్నట్లు తేలింది. వారికి మందులు ఇచ్చి ఆరోగ్యాన్ని కాపాడుతుండగా.. 1,179 మంది క్యారియర్స్‌గా గుర్తించారు. వీరికి ఎలాంటి లక్షణాలు లేకపోయినా రక్తహీనతకు సంబంధించిన వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నట్లు లెక్కలు వేశారు. ఈ వ్యాధి ఉంటే హిమోగ్లోబిన్ శాతం పూర్తిగా తగ్గిపోతుంది. క్రమేపి తగ్గడంతోపాటు ఎప్పుడు పూర్తిగా తగ్గుతుందో తెలిసే అవకాశాలు ఉండవు. అందుకే ముందస్తుగా వ్యాధిని గుర్తిస్తే ఎలాంటి ప్రాణాప్రాయం ఉండదని వైద్యులు చెబుతున్నారు.
రక్త పరీక్షల ద్వారా వ్యాధిని గుర్తించే అవకాశం
రక్తహీనత సమస్యనే సికిల్ సెల్ అని అనవచ్చు. జన్యుపరంగా వచ్చే సమస్య కూడాను. మేనరికాల వల్ల వచ్చేది తలసేమియా. ఆ కోవలోదే ఈ వ్యాధి. రక్తనాళాలు కొడవలి ఆకారంలోకి మారడం వల్ల శరీరంలో రక్తం తగ్గిపోతుంది. ఒళ్లు అంతా నొప్పులు ఉంటాయి. నీరసం ఉంటుంది. తరచూ కామెర్లు వచ్చేవిధంగా బాధ ఉంటుంది. చాలా సమస్యలు వస్తాయి. హెచ్‌బీఎల్‌సీ పరీక్ష చేస్తే వ్యాధిని గుర్తించవచ్చు. వ్యాధి నిర్ధారణ అయితే మందులు వాడాలి. ప్రభుత్వం నుంచి సరఫరా ఉన్నాయి. రాకుండా చూడాలి అంటే ముందస్తు పరీక్షలు చేయించుకోవాలి. అన్ని హాస్టల్స్, స్కూల్స్‌లో పిల్లలకు పరీక్షలు చేస్తున్నాం.
– డాక్టర్ మధువరణ్, ప్రోగ్రాం అధికారి, సికిల్ సెల్