జూలూరుపాడు/ వైరాటౌన్, మార్చి 24 : సీతారామ ప్రాజెక్టు నిర్మాణం గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే 80 శాతం పూర్తయిందని, మిగతా 20 శాతం పనులకు బడ్జెట్లో నిధులు కేటాయించలేరా? అని వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు చంద్రావతి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వెంటనే పెండింగ్ పనులన్నీ పూర్తి చేసి ఉమ్మడి జిల్లా రైతాంగానికి సాగునీరు, తాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
వినోభానగర్ సమీపంలోని సీతారామ ప్రాజెక్ట్ ప్రధాన కాల్వ నుంచి ఏన్కూరు మండలంలోని సాగర్ కాల్వ వరకు చేపట్టిన లింక్ కెనాల్ పనులను బీఆర్ఎస్ నాయకులతో కలిసి సోమవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సీతారామ ప్రాజెక్ట్ పనులు పూర్తి కాకముందే ఆర్భాటంగా సాగర్ కెనాల్‌కు నీటిని విడుదల చేసి రెండు రోజులు కాక ముందే నిలిపివేసిందని విమర్శించారు. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పూర్తయిన పనులను కొనసాగించకుండా..
సాగర్ కెనాల్లో నీటిని కలిపేందుకు రూ.వంద కోట్లు కేటాయించి ఆ పనులపై దృష్టి సారించారే తప్ప పాత డిజైన్ ప్రకారం నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు నిధులు ఎందుకు కేటాయించలేదని ఆమె ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ.. నిత్యం ప్రజల్లో ఉంటూ వారి పక్షాన పోరాటాలు చేపడుతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు భూక్యా వినోద్‌కుమార్, ఇటుకల రాజు, షేక్ బాజీ, షేక్ చాంద్‌పాషా, భూక్యా ధర్మానాయక్, నరేశ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.