బూర్గంపహాడ్, అక్టోబర్ 29: నియోజకవర్గంలో తాను చేపట్టిన అభివృద్ధి పనులను చూసి ప్రజలు ఎన్నికల్లో ఆశీర్వదించాలని ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ పినపాక ఎమ్మెల్యే అభ్యర్థి రేగా కాంతారావు అన్నారు. పినపాక పట్టీనగర్, మోరంపల్లి బంజరలో పలు పార్టీలకు చెందిన 80 కుటుంబాలు ఆదివారం బీఆర్ఎస్లో చేరాయి. పార్టీలో చేరిన వారికి గులాబీ కండువాలు కప్పి ప్రభుత్వ విప్ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. నిరుపేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ పార్టీ మ్యానిఫెస్టోను సిద్ధం చేశారన్నారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ గెలుపు తథ్యమన్నారు. అసైన్డ్ భూములకు పట్టాలు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉన్నారన్నారు. ఎన్నికల్లో గెలవగానే హామీని అమలు చేస్తారన్నారు. దళితబంధు అందని వారు నిరాశ పడొద్దన్నారు. ఎన్నికల గెలిచిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి పథకాన్ని అమలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీశ్, నాయకులు వల్లూరిపల్లి వంశీకృష్ణ, మేడం లక్ష్మీనారాయణరెడ్డి, రామకొండారెడ్డి, తోటమళ్ల భిక్షం, చేతుల పెద్ద వీర్రాజు, బత్తుల కొండారెడ్డి, ఖగేందర్రెడ్డి, కురుకుంట్ల చిన్నపరెడ్డి, రామిరెడ్డి, బండారు లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.