ఖమ్మం వ్యవసాయం, ఆగస్టు 23 : జిల్లాలోని స్త్రీ, శిశు సంక్షేమ శాఖలోని సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం (ఐసీడీఎస్)లో భారీగా ఖాళీలు ఉండడంతో లబ్ధిదారులు సరైన సేవలు పొందలేకపోతున్నారు. అలాగే మిగతా వారిపై భారీగా అదనపు భారం పడుతోంది. మాతృ శాఖ సేవలతోపాటు ఇతర పనుల బాధ్యతలనూ వీరు నిర్వహిస్తుంటారు.
ఖాళీలు భర్తీ కాకపోవడంతో అటు సేవలకు, ఇటు విధులకు ఆటంకం కలుగుతోంది. ఐసీడీఎస్‌లో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లది క్షేత్రస్థాయిలో చాలా కీలకపాత్ర. ఒకవైపు సొంగ అంగన్వాడీ కేంద్రాన్ని నిర్వహించుకోవాలి. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం సహా పలు రకాల సేవలందించాలి. వైద్యారోగ్య శాఖ కార్యక్రమాల్లోనూ పాల్పంచుకోవాలి. చివరికి ఎన్నికల విధుల్లో క్షేత్రస్థాయిలో బూత్ లెవెల్ అధికారులగానూ సేవలందించాలి. ఇన్ని రకాల విధుల్లో తలమునలవుతున్న వీరిపై ఈ ఖాళీల కారణంగా ఇంకా అదనపు పరిభారం పడుతోంది.
దీంతో వీరి ఖాళీలు భర్తీ అయితే వీరికి పనిభారం తగ్గడంతోపాటు మెరుగైన సేవలూ అందే అవకాశం ఉంటుంది. జిల్లాలో ఖమ్మం రూరల్, ఖమ్మం అర్బన్ వంటి అతి పెద్ద ప్రాజెక్టుల్లో సిబ్బంది కొరత మరింత తీవ్రంగా ఉంది. మరికొద్ది రోజుల్లో అంగన్వాడీ కేంద్రాలను ప్లేస్కూళ్లుగా, ప్రీ స్కూళ్లుగా మారుస్తామని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఖాళీల భర్తీ ఆవశ్యకత ఎంతో ఉంది.
జిల్లా ఐసీడీఎస్ శాఖ చరిత్రలో ఎన్నడూలేని విధంగా ప్రస్తుతం 714 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లాలో మొత్తం 1,840 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటిల్లో 1,723 మంది టీచర్లు మాత్రమే ఉన్నారు. 117 టీచర్ పోస్టులు కొద్ది రోజులుగా ఖాళీగా ఉన్నాయి. అలాగే, 1,840 మంది హెల్పర్లకుగాను కేవలం 1,243 మంది మాత్రమే ఉన్నారు. 597 హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.