ఖమ్మం, మే 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మూడు వేర్వేరు కేసుల్లో రూ.14 లక్షల విలువ చేసే 560 కేజీల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకొని, 11 మంది నిందితులను అరెస్టు చేసినట్లు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ తెలిపారు. ఖమ్మం జిల్లా ఏన్కూరు పోలీస్‌స్టేషన్ ఆవరణలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ వివరాలు వెల్లడించారు. ఈ నెల 28న టాస్క్‌ఫోర్స్, పోలీస్, వ్యవసాయాధికారులు ఏన్కూరుకు చెందిన గాజుల నర్సింహారావు అనే వ్యక్తి రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్లు సమాచారం అందిన వెంటనే తనిఖీలు నిర్వహించి.. అతడి వద్ద నుంచి వివిధ పేర్లతో ఉన్న 450 గ్రాముల బరువున్న పత్తి విత్తన ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఈ విత్తనాలు ఏపీ రాష్ట్రం మైలవరం నుంచి తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్లు విచారణలో తెలిందన్నారు. దీనిపై ప్రత్యేక బృందం మైలవరం మండలం చంద్రుగూడెం గ్రామంలో విచారణ చేపట్టగా.. శాలివాహన అనే వ్యక్తి ఇంట్లో కుటీర పరిశ్రమగా పెట్టుకుని నకిలీ విత్తనాలు తయారు చేస్తున్నట్లు వెలుగుచూసిందన్నారు. సదరు నిందితుడు కర్ణాటక నుంచి విత్తనాలు, 555 నెంబర్ పేరుతో కవర్లను తీసుకొచ్చి ఇక్కడ తయారు చేసి ఏజెంట్ల ద్వారా విక్రయిస్తున్నట్లు తేలిందన్నారు. నిందితుడి ఇంటి వద్ద క్వింటా రోజోబెల్ మిశ్రమం కలిపి ప్యాక్ చేయని పత్తి విత్తనాలు, అరుణోదయ లేబుల్‌తో 450 గ్రాముల బరువున్న 272 పత్తి విత్తన ప్యాకెట్లు, సీల్ వేయడానికి వాడే రెండు మిషన్లు, వేయింగ్ మిషన్, ఖాళీ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
అలాగే ఈ నెల 27న పోలీసులు, వ్యవసాయాధికారులు ఏన్కూరు మండలం రేపల్లెవాడ శివారులో నకిలీ విత్తనాలు అమ్ముతున్నాడనే సమాచారంతో వెనిగండ్ల శ్రీనివాసరావు అనే వ్యక్తి వ్యవసాయ భూమిలో తనిఖీలు నిర్వహించగా.. 210 ప్యాకెట్లలో ఉన్న ఒక కేజీ నకిలీ విత్తనాలు బయటపడ్డట్లు తెలిపారు. నిందితుడిని విచారించగా.. అతడి అనుచరుడు ఇమ్మినేని కిషోర్ వద్ద 120 కిలోల పత్తి విత్తనాలు లభ్యమైనట్లు తెలిపారు. నిందితులు ఇద్దరూ ఏపీ రాష్ట్రం బాపట్ల నుంచి వారి బంధువు లక్ష్మీనారాయణ ద్వారా నకిలీ విత్తనాలు ఇక్కడికి తీసుకొచ్చి రైతులకు విక్రయిస్తున్నట్లు తేలిందన్నారు.
అదేరోజు పక్కా సమాచారంతో ఏన్కూరు పరిధిలోని పోలేటి కోటేశ్వరరావు ఇంటి వద్ద తనిఖీలు చేయగా.. 20 నకిలీ పత్తి విత్తన ప్యాకెట్లు లభించాయని, విచారణలో ఏపీ రాష్ట్రం తెనాలి నుంచి తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు తేలిందన్నారు. పై మూడు కేసులలో నిందితులుగా ఉన్న వెనిగండ్ల శ్రీనివాసరావు, ఉమ్మనేని నరేశ్, అన్నెం లక్ష్మీనారాయణ, గుగులోత్ గోపి, వరదబోయిన రమేశ్, తాంబళ్ల నవీన్, దొంతబోయిన రమేశ్, గాజుల నర్సింహారావు, చర్లపల్లి శాలివాహన, పోలేటి కోటేశ్వరరావు, వెనిగండ్ల రవిలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.
వీరి వద్ద నుంచి మొదటి కేసులో ఒక కేజీ బరువున్న 330 పత్తి విత్తన ప్యాకెట్లు, 2 లీటర్ల రోజోబిన్ కెమికల్, త్రాసు, రెండో కేసులో ఒక క్వింటా లూజు పత్తి విత్తనాలు, 450 గ్రాముల బరువున్న 270 అరుణోదయ, అడ్వాన్స్ 555 పేరుతో ఉన్న పత్తి విత్తన ప్యాకెట్లు, లీటర్ రోజోబిన్ కెమికల్, వేయింగ్ మిషన్, సీల్ వేసే యంత్రం, 400 ఖాళీ ప్యాకెట్లు, మూడో కేసులో 450 గ్రాముల బరువుతో పల్లవి సీడ్స్ పేరుతో ఉన్న 20 ప్యాకెట్ల్ల పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో కల్లూరు ఏసీపీ రఘు, సత్తుపల్లి రూరల్ సీఐ ముత్తిలింగం, ఎస్సైలు రఫీ, హరిత తదితరులు పాల్గొన్నారు.