భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మూడో దశ నామినేషన్ల ప్రక్రియ బుధవారం మొదలైంది. ఈ విడతలో భద్రాద్రి జిల్లాలోని ఏడు మండలాల్లో ఉన్న 155 పంచాయతీలకు, 1,330 వార్డులకు ఈ నెల 17న ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకోసం బుధవారం మొదలైన తొలి రోజు నామినేషన్ల దాఖలు ప్రక్రియ మందకొడిగా సాగింది. బుధవారం మంచిరోజు కాదనే భావనతో ఎక్కువమంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు ఆసక్తి చూపలేదు.
మండలాల వారీగా..
లక్ష్మీదేవిపల్లి మండలంలో 31 సర్పంచ్ స్థానాలకుగాను నాలుగు, 260 వార్డు స్థానాలకుగాను 23 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆళ్లపల్లిలో 12 సర్పంచ్ స్థానాలకు గాను ఒకటి, 90 వార్డులకుగాను రెండు; గుండాలలో 11 సర్పంచ్ స్థానాలకుగాను మూడు, 96 వార్డు స్థానాలకు గాను మూడు; జూలూరుపాడులో 23 సర్పంచ్ స్థానాలకు గాను ఏడు, 188 వార్డు స్థానాలకుగాను 11; సుజాతనగర్లో 13 సర్పంచ్ స్థానాలకు గాను మూడు, 110 వార్డు స్థానాలకుగాను ఒకటి; టేకులపల్లిలో 36 సర్పంచ్ స్థానాలకు గాను 24, 312 వార్డు స్థానాలకు గాను 8; ఇల్లెందు మండలంలో 29 సర్పంచ్ స్థానాలకుగాను 9, 254 వార్డు స్థానాలకుగాను 13 చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి.
రెండో దశకు 778 నామపత్రాలు..
రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో మంగళవారం అర్ధరాత్రి వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. ఈ దశలో మొత్తం 154 సర్పంచ్ స్థానాలకుగాను 778 నామినేషన్లు, 1,384 వార్డు స్థానాలకు గాను 3,465 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో పాల్వంచ మండలం పాండురంగాపురం పంచాయతీలో సర్పంచ్ స్థానానికి, 13 వార్డు స్థానాలకు ఎవరూ నామినేషన్ దాఖలు చేయలేదు.
పొత్తుల ఎత్తులు..
పంచాయతీ ఎన్నికల్లో పొత్తుల ఎత్తులు చోటుచేసుకుంటున్నాయి. విచిత్ర పొత్తులు చూడాల్సి వస్తోంది. నిన్నటి వరకు బద్ధ శత్రువులుగా ఉన్న రాజకీయ నాయకులు సైతం పల్లె స్థాయిలో ఇప్పుడు ఒక్కటై చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. ఎన్నికలకు వెళ్తే భారీగా ఖర్చవుతుందని భావించిన నాయకులు.. ఒకరు సర్పంచ్ పదవిని, మరొకరు ఉప సర్పంచ్ పదవిని మాట్లాడుకొని నామినేషన్లు వేసుకుంటున్నారు. కొన్నిచోట్ల సీపీఐ, కాంగ్రెస్ నాయకులు ఒప్పందం కుదుర్చుకొని నామినేషన్ల వేస్తున్నారు.