భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ) : వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓటు వేసేందుకు పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. జిల్లాలో ఓటు హక్కు నమోదు తొలుత మందకొడిగా సాగినా.. అధికారులు దీనిపై విస్తృతంగా ప్రచారం చేశారు. అయినా పట్టభద్రులు ఓటు నమోదుకు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. డిగ్రీ పూర్తి చేసిన వేలాది మంది నిరుద్యోగులు తమకు ఉద్యోగాలు రాకపోవడంతో ఓటు వేసినా ఫలితం లేదనే ఉద్దేశంతో ఓటరుగా నమోదు చేసుకోవడం లేదని చెబుతున్నారు. ఈ క్రమంలో ఎన్నికల కమిషన్ పట్టభద్రుల ఓటర్ల నమోదుకు మార్చి 24వ తేదీ వరకు వెసులుబాటు కల్పించింది.
నెల రోజుల నుంచి ఓటర్ల నమోదుకు అవకాశం ఇచ్చినా పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకోలేదు. ఆన్లైన్లో సర్వర్ పని చేయకపోవడం వల్ల చేద్దాంలే.. చూద్దాంలే.. అనుకొన్న కొందరు చివరి వరకు చూసి నమోదు చేయకుండా వదిలేసుకున్నారు. దీంతో మొదటి విడతలో ఇప్పటివరకు 40,420 మంది పట్టభద్రులు ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. ఇందులో ఆన్లైన్లో 39,991 మంది దరఖాస్తు చేసుకోగా.. 429 మంది ఆఫ్లైన్ ద్వారా నమోదు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న ప్రతీ ఓటరు ఇంటికి వెళ్లిన బీఎల్వోలు దరఖాస్తుదారుల పత్రాలను సరిచూసి నమోదు చేసుకున్నారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓటర్లుగా 44 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది 54 వేలకు మందికి పైగా పట్టభద్రులు జిల్లాలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇంకా 14 వేల మందికి పైగా ఓటర్లుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.
ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా కోసం ఈ నెల 22న డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మొదటి విడతో ఈ నెల 6వ తేదీ చివరి రోజు అయినప్పటికీ మరోసారి ఓటర్లకు అవకాశం కల్పించేందుకు వెసులుబాటు కల్పించారు. మార్చి 24వ తేదీ వరకు పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవచ్చు. ఏప్రిల్ 4వ తేదీన తుది జాబితా విడుదల చేయనున్నారు.
డిగ్రీ పూర్తి చేసిన ప్రతి పట్టభద్రుడు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి. మార్చి 24వ తేదీ వరకు అవకాశం ఉంది. ఆన్లైన్లో కాకపోతే తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆయా దరఖాస్తులను బీఎల్వోలు వచ్చి వెరిఫికేషన్ చేస్తారు. గ్రామ, మండల, పట్టణ స్థాయిలో ఓటు నమోదుపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం.