
వాడవాడలా ఘనంగా నిర్వహించుకోవాలి
అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలి
పండుగ వాతావరణంలో కమిటీల నిర్మాణం
జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్
ఖమ్మం నగరంలో మధిర నియోజకవర్గ సమావేశం
ఖమ్మం, ఆగస్టు 30: టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు 2న టీఆర్ఎస్ జెండా పండుగను ఘనంగా నిర్వహించాలని జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, టీఎస్ సీడ్స్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు పిలునిచ్చారు. మధిర నియోజకవర్గ ముఖ్య నేతలు, కార్యకర్తల సమావేశం ఖమ్మంలోని తెలంగాణ భవన్లో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో జెండా పండుగను పెద్ద ఎత్తున నిర్వహించాలన్నారు. టీఆర్ఎస్ జెండా ప్రాముఖ్యతను ప్రజలకు వివరించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అమలు చేసిన పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్రంలో ఇంటింటికి ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలు అందించారని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు సీఎం పలు పథకాలకు శ్రీకారం చుట్టారని అన్నారు. తెలంగాణ ప్రజలకు గులాబీ జెండా తప్ప మరో జెండా అవసరం లేదనే విషయాన్ని స్పష్టం చేయాలని అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అతిపెద్ద పార్టీ టీఆర్ఎస్ మాత్రమేనని, మంత్రి కేటీఆర్ పార్టీ సంస్థాగతంపై దృష్టి పెట్టారని అన్నారు. గ్రామాల్లో పార్టీని పటిష్టం చేసేలా కమిటీలు వేయనున్నట్లు చెప్పారు. కమిటీల్లో యువతకు ప్రాధాన్యమివ్వాలని, పనిచేసే వారికి బాధ్యత అప్పగించాలని పిలుపునిచ్చారు. 10వ తేదీలోగా గ్రామ కమిటీల నిర్మాణం పూర్తి చేయాలన్నారు.