
మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలనే సాగు చేయాలి: ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ
టేకులపల్లి, ఆగస్టు 30: టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన రైతు వేదికలు భావితరాల రైతులకు కోవెలలు కానున్నాయని ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య పేర్కొన్నారు. మండలంలోని గొల్లపల్లి, కోయగూడెం, బేతంపూడి, బోడు, గంగారం క్లస్టర్ల రైతు వేదికలను సోమవారం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరిప్రియ, జడ్పీ చైర్మన్ కనకయ్య మాట్లాడుతూ మండలంలోని మొత్తం 36 గ్రామ పంచాయతీలను గాను ఐదు రైతు క్లస్టర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రస్తుత కాలానికి అనుకూలంగా రైతులు మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలనే సాగు చేయాలని సూచించారు. రైతువేదిక నిర్మాణానికి భూమిని దానంగా ఇచ్చిన లక్కినేని శ్యామ్‌బాబును సన్మానించారు. అనంతరం బోడు, చింతోని చెలక గ్రామ పంచాయతీలో వైకుంఠధామలను ప్రారంభించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, రైతుబంధు సమితి బాధ్యులు మాధవరావు, శ్యామ్‌బాబు, ఎంపీపీ రాధ, సొసైటీ వైస్ చైర్మన్ శ్రీనివాసచౌదరి, ఏడీఏ వాసవీరాణి, ఏవో అన్నపూర్ణ, డీఈ రామకృష్ణ, ఎంపీడీవో బాలరాజు, ఎంపీవో శ్రీనివాసరావు, సీఐ రాజు, ఎస్సైలు రాజ్‌కుమార్, శ్రీనివాస్, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.