అశ్వారావుపేట, జూన్ 9: అడవుల సంరక్షణలో స్థానిక అటవీ అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా గిరిజనులు అడవులను నరుకుతూనే ఉన్నారు. కొత్త పోడు నరికితే కఠిన చర్యలు తప్పవని ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నా ప్రయోజనం కనిపించడం లేదు. క్షేత్ర సిబ్బంది అలసత్వం కొత్త పోడుకు ఊతమిస్తోంది. తాజాగా చోటుచేసుకున్న పోడు భూమి వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి చేరింది. దీంతో ద్వితీయ శ్రేణి ఉద్యోగులను కాపాడే ప్రయత్నంలో శాఖాపరమైన చర్యలకు బీట్ ఆఫీసర్ బలయ్యాడు. తనను మాత్రమే బలి చేశారంటూ బాధిత బీట్ ఆఫీసర్ పైస్థాయి అధికారులపై ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేయనున్నాడు.
మండలంలోని గుమ్మడవల్లి సెక్షన్లో సుమారు నాలుగు నెలల క్రితం కొందరు గిరిజనులు పోడు నరికారు. పోడు పనులు వేగంగా సాగుతుండడంతో ఫారెస్ట్ రేంజర్ మురళీ ఇటీవల క్షేత్ర సందర్శనకు వెళ్లారు. అప్పడు కొత్తగా పోడు నరుకుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రేంజర్.. పోడు గిరిజనులను గుర్తించాలని సిబ్బందిని ఆదేశించారు. దీంతోపాటు భూమిని స్వాధీనం చేసుకుని తిరిగి ప్లాంటేషన్ వేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. అలాగే, పోడుకు బాధ్యులైన సిబ్బందిపై చర్యల నిమిత్తం జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక పంపించారు. పోడు నరికిన ముగ్గురిపై కేసులు కూడా నమోదు చేసినట్లు తెలిసింది. రేంజర్ నివేదిక ఆధారంగా విచారించిన ఉన్నతాధికారులు.. అక్కడి బీట్ ఆఫీసర్ నరసింహారావును సస్పెన్షన్ చేస్తూ మూడు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యవహారంపై బాధిత బీట్ ఆఫీసర్ ఆందోళన వ్యక్తం చేశాడు. కేవలం తన ఒక్కడిపైనే చర్యలు తీసుకునేలా ద్వితీయ శ్రేణి అధికారులు కుట్ర చేశారని, ఇతర ఇబ్బంది పాత్రపై కనీసం రిపోర్ట్ చేయకపోవడం ఇందుకు నిదర్శనంగా అనుమానిస్తున్నాడు. ఈ విషయమై ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది.
నాలుగు నెలల క్రితం పోడు నరికినప్పటికీ కేవలం 10 రోజుల క్రితమే అడవి నరికినట్లు స్థానిక అధికారులు జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక పంపించినట్లు సమాచారం. సుమారు 30 ఎకరాలకుపైగా పోడును ముగ్గురు గిరిజనులు కేవలం 10 రోజుల్లోనే నరకగలరా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అటవీ విభాగంలోని కొందరిని శాఖాపరమైన చర్యల నుంచి కాపాడేందుకు ఇటీవల అడవి నరికినట్లు నివేదిక పంపించారనే వాదన వినిపిస్తోంది.
పోడు భూమిని స్వాధీనం చేసుకున్న అటవీ అధికారులు అందులో ప్లాంటేషన్ చేసేందుకు చర్యలు చేపట్టారు. ఏటా ప్లాంటేషన్ విస్తరణ ప్రణాళికలో ఈ పోడు భూమిని కూడా చూపినట్లు తెలిసింది. పోడు భూమిలో ప్లాంటేషన్ వేసేందుకు పనులను వేగవంతం చేశారు. ప్లాంటేషన్ తర్వాత కొత్త పోడు వ్యవహారం సమసిపోతుందనే భావనతో పనులు త్వరితగతిన పూర్తి చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
పోడు వ్యవహారంలో బాధ్యులైన అందరిపైనా చర్యలు ఉంటాయి. దశల వారీగా బాధ్యులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారు. తాను క్షేత్రస్థాయి తనిఖీకి వెళ్లినప్పుడు కొత్త పోడును గుర్తించాను. కొందరు పోడు నరుకుతున్నా బీట్ ఆఫీసర్ కనీస సమాచారం ఇవ్వలేదు. పోడు వ్యవహారంలో బీట్ ఆఫీసర్ నరసింహారావును సస్పెన్షన్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్యులు జారీ చేశారు.