
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ దర్శనం చేసుకోవాలి
ఎప్పటికప్పుడు పారిశుధ్య చర్యలు చేపట్టాలి
ఉత్సవాలకు వచ్చే వారికి ప్రత్యేక బస్సులు
వచ్చే నెల 12వ తేదీన తెప్పోత్సవం
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
భద్రాద్రిలో అధ్యయనోత్సవాల నిర్వహణపై సమీక్ష
భద్రాచలం, డిసెంబర్ 29 : భద్రాది శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో 3వ తేదీ నుంచి నిర్వహించనున్న ముక్కోటి ఉత్సవాలకు వచ్చే భక్తులకు సౌకర్యవంతంగా ఏర్పాట్లు చేయనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. బుధవారం భద్రాచలం సబ్ కలెక్టరేట్లో ముక్కోటి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల నిర్వహణపై కలెక్టర్ అధ్యక్షతన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతేడాది కరోనా వల్ల భక్తులను అనుమతించలేదని, ఈ ఏడాది భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉన్నందున తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. 12వ తేదీ తెప్పోత్సవం రోజున హంస వాహనంలోకి అనుమతి ఉన్న వారిని మాత్రమే ఎక్కించాలని సూచించారు. భక్తులు గోదావరిలో లోతు ప్రాంతాలకు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి, ప్రమాద హెచ్చరిక బోర్డులు, గజ ఈతగాళ్లు, కంట్రీ బోట్లను అందుబాటులో ఉంచాలని అన్నారు. గోదావరి నీటిమట్టం తక్కువగా ఉన్నందున లక్ష్మి బ్యారేజీ నుంచి నీటిని విడుదల చేయాలని ఇరిగేషన్ ఈఈ రామ్‌ప్రసాద్‌ను ఆదేశించారు. టిక్కెట్లు, వీఐపీ పాస్‌లు ఉన్నవారిని మాత్రమే సెక్టార్‌లోకి అనుమతించాలని, ప్రతి సెక్టార్ నిర్వహణకు ప్రత్యేక అధికారులను నియమించాలన్నారు. ఉత్తర ద్వార దర్శనం సమయంలో బందోబస్తు పటిష్టంగా చేయాలన్నారు. ముఖ్యంగా పారిశుధ్య నిర్వహణ విషయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కరోనా జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని, మాస్కులు ధరించిన భక్తులను మాత్రమే అనుమతించాలని చెప్పారు. రద్దీ ప్రాంతాల్లో ఆశ, అంగన్వాడీ కార్యకర్తల ద్వారా శానిటైజర్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
పట్టణంలో పండుగ వాతావరణం ఉట్టి పడేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రధాన ఆరోగ్య కేంద్రంలో బెడ్లు సిద్ధంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. భక్తులకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని అన్నారు. కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ సుమారు 80వేల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. విద్యుత్ అంతరాయం కలుగకుండా కొర్రాజుల గుట్ట సబ్‌స్టేషన్ నుంచి వినియోగించుకునేందుకు ఏర్పాటు చేస్తామన్నారు. పట్టణంలో మూడుచోట్ల పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేశామన్నారు. స్వచ్ఛ ముక్కోటి లక్ష్యంగా సకల ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, ఐటీడీఏ పీఓ గౌతమ్ పొట్రు, అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, భద్రాచలం ఏఎస్పీ అక్షాంశ్ యాదవ్, దేవస్థానం ఈఓ బానోత్ శివాజీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
రామయ్య సేవలో మంత్రి పువ్వాడ
శ్రీసీతారామచంద్ర స్వామివారిని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సతీసమేతంగా బుధవారం దర్శించుకున్నారు. ముక్కోటి ఉత్సవాల సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఆయన నేరుగా రామాలయానికి చేరుకున్నారు. ఆలయ అధికారులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అంతరాలయంలోని మూలమూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న లక్ష్మీతాయారమ్మ, ఆంజనేయస్వామి, భద్రుడి కోవెలను దర్శించారు. అర్చకులు వారికి వేదాశీర్వచనం అందజేసి, ప్రసాదాలు, శేష వస్ర్తాలను బహూకరించారు. మంత్రి వెంట ఈఓ బానోత్ శివాజీ, ప్రధానార్చకుడు విజయరాఘవన్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ తెల్లం వెంకట్రావు, మండల అధ్యక్ష, కార్యదర్శులు అరికెల్ల తిరుపతిరావు, కొండిశెట్టి కృష్ణమూర్తి, ఉపాధ్యక్షుడు రత్నం రమాకాంత్ పాల్గొన్నారు.